న్యూఢిల్లీ, మార్చి 9: ప్రయాగ్రాజ్లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళా సందర్భంగా గంగా నదిలో నీటి నాణ్యత స్నానాలు చేసేందుకు అనువుగా ఉందని గ్రీన్ టిబ్యునల్కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీసీసీబీ) తన తాజా నివేదికలో తెలియచేసింది. వేర్వేరు రోజులలో ఒకే ప్రదేశం నుంచి సేకరించిన నీటి నమూనాలు, ఒకే రోజున వేర్వేరు ప్రదేశాలలో తీసుకున్న నీటి నమూనాలలో భిన్న వివరాలు ఉన్న కారణంగా నది ప్రవాహ వ్యాప్తంగా నీటి నాణ్యత మొత్తంగా అందులో ప్రతిబింబించ లేదని, ఈ కారణంగా గణాంక విశ్లేషణ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందని సీసీసీబీ తన నివేదికలో తెలిపింది. పవిత్ర స్నానాలకు ముఖ్యమైన రోజులతో సహా జనవరి 12 నుంచి వారానికి రెండుసార్లు చొపున గంగా నది ప్రవహించే ఐదు ప్రదేశాలలో, యమునా నది ప్రవహించే రెండు ప్రదేశాలలో నీటి నాణ్యతను పర్యవేక్షించినట్టు జనవరి 28వ తేదీనాటి తన నివేదికలో సీపీసీబీ వెల్లడించింది.
కాలుష్య గంగలో స్నానం చేయను గంగా నది శుభ్రత, ఆ నదీ జలాల నాణ్యతపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే అనుమానాలు వ్యక్తం చేశారు. గంగా నదిలో తాను పవిత్ర స్నానం చేయబోనని ఆయన ప్రకటించారు. మూఢ నమ్మకాలు వీడి వివేకంతో ఆలోచించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఎంఎన్ఎస్ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం ఓ కార్యక్రమంలో రాజ్ ఠాక్రే మాట్లాడుతూ తన పార్టీ నాయకుడు బాల నంద్గావ్కర్ ఇటీవల ప్రయాగ్రాజ్లో ముగిసిన మహా కుంభ్ నుంచి పవిత్ర గంగా జలాలను తీసుకువచ్చారని, వాటిని తాగేందుకు నిరాకరించానని చెప్పారు.