Ayodhya Airport | వారణాసి, డిసెంబర్ 28: అయోధ్యకు వచ్చే భక్తుల కోసం స్థానిక రామాలయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, మరిన్ని సౌకర్యాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామం’ అని పేరుపెట్టనున్నట్టు సమాచారం.
ఇంతకుముందు ఈ విమానాశ్రయాన్ని ‘మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమనాశ్రాయం’గా పిలిచేవారు. రూ.1450 కోట్లతో ఎయిర్పోర్టును నిర్మించారు. 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. 600 మంది ప్రయాణికులకు అనువుగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది 10 లక్ష మంది దీని ద్వారా రాకపోకలు సాగిస్తారని భావిస్తున్నారు.
ప్రారంభోత్సవం రోజున ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతారు. రెగ్యులర్ విమానాలను జనవరి 6 నుంచి నడుపుతారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్ నుంచి ఇక్కడకు నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు అయోధ్య రామాలయం నుంచి 84 కిలోమీటర్ల పరిధిలో మద్యం అమ్మకాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది.