Priyanka Gandhi : ఢిల్లీలోని కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లను ప్రియాంకాగాంధీ బుగ్గల్లా నున్నగా తీర్చిదిద్దుతానన్న బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీ వ్యాఖ్యలను ప్రియాంకాగాంధీ వాద్రా తిప్పికొట్టారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రమేశ్ బిధూరీ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, అనవసరమైనవి అని అన్నారు. ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు అసలు అంశాలను చర్చ రాకుండా చేస్తాయని చెప్పారు.
ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ఆకతాయి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ప్రియాంకాగాంధీ అన్నారు. ఢిల్లీ ప్రజల సమస్యలపై, ఆ సమస్యల పరిష్కార మార్గాలపై మాట్లాడాలని సూచించారు. ‘రమేశ్ బిధూరీ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి. అనవసరమైనవి. ఆయన ఎప్పుడూ ఆయన బుగ్గల గురించి మాట్లాడలేదే. ఎన్నికల వేళ మనం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి’ అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల కల్కాజీలో రమేశ్ బిధూరీ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో రోడ్లను ప్రియాంకాగాంధీ బుగ్గల్లా నున్నగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణ చెప్పారు. ఈ క్రమంలో మీడియా ఇవాళ ఆ విషయాన్ని ప్రస్తావించగా ప్రియాంకాగాంధీ పైవిధంగా స్పందించారు.