Omar Abdullah: ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) చేసిన వ్యాఖ్యలు మా ఇండియా కూటమి (India Alliance) కే నష్టాన్ని కలిగించాయని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్ర నాయకుడు, జమ్ముకశ్మీర్ (Jammu-Kashmir) మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం శ్రీనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి సీట్ల సర్దుబాటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ప్రధానికి కుటుంబం లేదంటూ ఆయన (లాలూ ప్రసాద్‌ను ఉద్దేశించి) చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అవి మనకే నష్టాన్ని కలిగిస్తాయి. ఇలాంటివి ఓటర్లను ప్రభావితం చేయలేవు. ప్రస్తుతం ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి సారించాలి. నిజానికి మేం సెల్ఫ్‌గోల్ వేసుకున్నాం. ఈ వ్యాఖ్యలు చేసిన గోల్ కీపర్‌ను తొలగించాలి లేదా ఆయన వ్యాఖ్యలతో అవతలి వారు లబ్ధి పొందుతుంటే చూస్తూ ఉండిపోవాలి” అని ఒమర్ అబ్ధుల్లా వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమితో సీట్ల సర్దుబాటు విషయంలో జమ్ముకశ్మీర్‌లో మూడో పార్టీకి అవకాశం లేదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో కాకుండా మరొకరితో సీట్లు పంచుకోవాలని ముందే తెలిసుంటే ఇండియా కూటమిలో చేరేవాళ్లం కాదన్నారు. మరోవైపు ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.