హైదరాబాద్, జూన్ 15 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): స్వార్థ రాజకీయాల కోసం సొంత కూటమిలోని మిత్రులకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తున్నదా? రాజకీయ అవకాశవాదంతో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయాలనుకొంటున్నదా? గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే ఇది నిజమే అనిపిస్తున్నదని రాజకీయ పండితులు చెప్తున్నారు. మొన్న తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్.. అంతకుముందు ఢిల్లీ, పంజాబ్, జమ్ముకశ్మీర్.. ఇలా ఏ రాష్ట్ర రాజకీయాలను విశ్లేషించినా కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలపైనే చర్చ నడుస్తున్నదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం, డీఎంకేతో 55 ఏండ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకొని విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలిపింది. మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలకు తెరతీసిందని, ఇక భవిష్యత్తులో ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని డీఎంకే తేల్చిచెప్పింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి భేటీకి కూడా డీఎంకే హాజరు కాలేదు. కాంగ్రెస్ వైఖరి నచ్చక ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఇండియా కూటమికి ఇంతకుముందే గుడ్‌బై చెప్పింది. ఢిల్లీ భేటీకి ఆ పార్టీ కూడా హాజరుకాలేదు.
మొన్నటికి మొన్న బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పరాజయం పాలైతే కాంగ్రెస్ నేతలు తొలుత సంబురాలు చేసుకొన్నారు. బెంగాల్లో టీఎంసీ స్థానాన్ని కాంగ్రెస్ భర్తీ చేస్తుందంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమిలో టీఎంసీ భాగస్వామిగా ఉన్నదని, అలాంటి మిత్ర పక్షం ఓడిపోతే, సంబురాలు ఎలా చేసుకొంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే, టీఎంసీకి పోటీగా అభ్యర్థులను నిలబెట్టిన కాంగ్రెస్.. ఎన్నికల ప్రచారంలో మమతను టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ విమర్శలు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.
తాము నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమిలోని మిత్ర పక్షాలపై కూడా కాంగ్రెస్ డైరెక్టుగా యుద్ధాన్ని ప్రకటించిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రాష్ర్టాల ఎన్నికల సాకుతో మిత్ర పక్షాలను రాజకీయంగా దెబ్బతీయడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణిస్తున్నారు. ఇండియా కూటమిలోనే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న లెఫ్ట్ పార్టీలపై కాంగ్రెస్ తీరు ఇలాగే ఉన్నదంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణలో లెఫ్ట్ పార్టీల మద్దతును కూడగట్టిన కాంగ్రెస్.. కేరళలో మాత్రం అదే వామపక్షాలపై కత్తులు దూసిందని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అప్పటి విజయన్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి నోరుపారేసుకొన్న వీడియోలను ఈ మేరకు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక, కేరళలో రాజకీయ వైరుధ్యం కారుణంగా ఆ రాష్ట్ర మాజీ సీఎం విజయన్ను ఆలింగనం చేసుకోలేనన్న రాహుల్ వ్యాఖ్యలపై సీపీఎం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ మీ హగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి అంటూ ఘాటుగా స్పందించింది. మరోవైపు, పంజాబ్, ఢిల్లీ ఎన్నికల్లో తమ కూటమిలోని మిత్రపక్షం ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇండి కూటమికి ఆప్ గుడ్‌బై చెప్పింది. జమ్ముకశ్మీర్‌లోనూ కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయాలే తీసుకొన్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
కాంగ్రెస్‌తో జట్టుకడితే ఓటమి తప్పదనే వాదన రాజకీయాల్లో క్రమంగా బలపడుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి (ఎస్పీ) కాంగ్రెస్‌తో ముప్పు పొంచి ఉన్నదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సీట్ల కేటాయింపు సమయంలో చిచ్చు రేపడం, కేటాయించిన సీట్లలో 15-20 శాతం సీట్లలో కూడా గెలువలేకపోవడంతో కాంగ్రెస్ వల్ల కూటమి బలహీనపడి ఓటమిపాలు అయ్యే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. బీహార్‌లో చేసినట్టుగా స్థానిక, రాష్ట్ర అంశాల నుంచి దృష్టిని మరల్చి, జాతీయ అంశాలను ఎన్నికల ప్రచారాంశాలుగా తెర మీదకు తెచ్చి విజయావకాశాలను కాంగ్రెస్ దెబ్బతీసే అవకాశం ఉందని చెబుతున్నారు.
పంజాబ్‌లో కాంగ్రెస్‌తో మళ్లీ పొత్తు పెట్టుకొంటే ఆప్‌కు కూడా ఇదే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇక, కూటమి పార్టీల్లో చీలికలు ఏర్పడితే, భరోసా ఇవ్వాల్సిన కనీస ధర్మాన్ని మరిచిన కాంగ్రెస్.. వేడుక చూస్తూ, ఆ పార్టీల అంతర్గత కుమ్ములాటను ఎగదోసే ప్రయత్నం చేసిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, బెంగాల్లో ప్రస్తుత టీఎంసీ ఉదంతాలను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. మొత్తంగా మిత్రులకు వెన్నుపోటు పొడిచి, స్వార్థపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ పేటెంట్గా మారిందంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
వెన్నుపోటు రాజకీయాలు చేసేవారు మిత్రపక్షాలకు మాత్రం నీతులు చెప్తున్నారని డీఎంకే అధినేత స్టాలిన్ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలోని పక్షాలన్నీ ఐక్యతా స్ఫూర్తిని ప్రదర్శించాలంటూ ఇటీవలి భేటీలో కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే స్టాలిన్ సన్నిహితుల వద్ద ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇటు విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్‌పై కూడా స్టాలిన్ ధ్వజమెత్తారు. విజయ్ పార్టీ కేంద్రంలోని బీజేపీకి జిరాక్స్ కాపీలా వ్యవహరిస్తున్నదని స్టాలిన్ మండిపడ్డారు. ప్రతిపక్షాలను బలహీనపర్చేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గుర్తిచేస్తూ కొనుగోలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు.