India | న్యూఢిల్లీ: భద్రతలో భారత్ కంటే దాయాది దేశం పాకిస్థాన్ మెరుగైన స్థానంలో ఉన్నది. ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారత్ 66వ స్థానంలో ఉండగా, పాక్ 65వ స్థానంలో నిలిచింది. నైరుతి యూరప్‌లోని చిన్న దేశం అండొర్రా అత్యంత సురక్షితమైన దేశంగా టాప్ ర్యాంకు దక్కించుకున్నది. ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ, ఖతార్, తైవాన్, ఒమన్ నిలిచాయి. ఈ మేరకు నంబియో భద్రతా సూచిక 147 దేశాలతో తాజాగా జాబితాను విడుదల చేసింది.
ఆయా దేశాల్లో భద్రతా పరిస్థితులు, నేరాల రేటు, ప్రజల జీవన ప్రమాణాలు పరిగణనలోనికి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు. ఆయా దేశాలను సందర్శించే పర్యాటకుల అభిప్రాయాలను, రాత్రివేళ, పగటి వేళ వీధుల్లో నడిచేటప్పుడు స్థానికులు ఎంత భద్రత పొందుతున్నారనే అంశాలను సర్వేలో పరిగణనలోనికి తీసుకున్నారు. ‘దోపిడీలు, కార్ల దొంగతనాలు, అపరిచితులపై భౌతిక దాడులు, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు; చర్మం రంగు, జాతి, లింగం, మతం ఆధారంగా వివక్ష’ వంటి అంశాలను పరిశీలించారు. ఆస్తుల విధ్వంసం, లైంగిక నేరాలు, దాడుల వంటి హింసాత్మక నేరాలనూ ర్యాంకింగ్స్ ఇవ్వడంలో పరిశీలించామని నిర్వాహకులు తెలిపారు. సర్వేలో భారత్ -66, పాకిస్థాన్ -65, అమెరికా -89, బ్రిటన్ -87, చైనా -15 ర్యాంకులు పొందాయి.