NEET-UG-2024 | నీట్-యూజీ 2024 ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు సాధించిన మార్కులను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. అయితే, విద్యార్థుల గుర్తింపును గోప్యంగా ఉంచాలని సూచించింది. విద్యార్థుల గుర్తింపును గోప్యంగా ఉంచాలని.. పరీక్షా కేంద్రం, నగరాల వారీగా ఫలితాలను వెల్లడించాలని చెప్పింది. కేసు విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. నీట్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని స్పష్టం చేసింది. పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
సొలిసిటర్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 131 మంది విద్యార్థులు మాత్రమే రీటెస్ట్ కోరుతున్నారని.. సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు తాము ప్రాధాన్యం ఇస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి చివరకు ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. పిటిషనర్లు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు? అంటూ సీజేఐ ప్రశ్నించారు. పరీక్ష రాసిన 23లక్షల మందిలో లక్ష మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారని.. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే రీ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతుందోని.. దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపెడితే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.