NEET 2024 | నీట్ యూజీ-2024 పేపర్ లీక్, అవకతవకల కేసులో పాట్నా ఎయిమ్స్‌కు చెందిన నలుగురు విద్యార్థులను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. మొదట విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారించింది. నలుగురి ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్‌ను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పేపర్ లీక్ కేసులో వీరి ప్రమేయం ఉందని తెలుస్తున్నది. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు ఆయా విద్యార్థుల హాస్టల్ గదులను సైతం సీజ్ చేశారు. కరణ్ జైన్, కుమార్ సాను, రాహుల్ ఆనంద్, చందన్ సింగ్ ప్రధాన నిందితుడు పంకజ్ సింగ్‌కు సహాయపడినట్లుగా సమాచారం. అయితే, నలుగురు ముగ్గురు 2021 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులని పేర్కొన్నారు. బుధవారం సీబీఐ బృందం పాట్నా ఎయిమ్స్ క్యాంపస్‌కు చేరుకుని ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత నాలుగో విద్యార్థి సీబీఐ కార్యాలయంలో లొంగిపోయేందుకు ముందుకు వచ్చాడు.
గురువారం వారిని అరెస్టు చేసి ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు హాజరుపరచగా, నాలుగు రోజుల కస్టడీకి ఇచ్చింది. ఈ కేసులో కీలక నిందితుడు రాకేష్ రంజన్ అలియాస్ రాకీని విచారించగా నలుగురు విద్యార్థుల పేర్లు బయటకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాకీ ఈ నలుగురు విద్యార్థులను పరీక్షల్లోని సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేశాడని.. ఈ కేసులో ఆరోపణలున్న కింగ్‌పిన్ సంజీవ్ ముఖియాకు విశ్వసనీయ సహాయకుల్లో ఒకరుగా తెలుస్తున్నది. ప్రశ్నపత్రాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు పాట్నా, రాంచీలకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులను ఏర్పాటు చేసింది రాకీయేనని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇక పంకజ్, రాజుసింగ్ అనే ఇద్దరు నిందితులను సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన పంకజ్‌ను పాట్నాలో అరెస్టు చేయగా.. రాజుసింగ్ అతనికి సహాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. బుధవారం పాట్నాలోని ప్రత్యేక కోర్టులో వారిని హాజరుపరుచగా.. 14 రోజులు సీబీఐ రిమాండ్‌కు పంపింది.