న్యూఢిల్లీ: విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే పలు మార్పులను నీట్ యూజీ-2026లో అమలు చేయనున్నట్టు జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టీఏ) శుక్రవారం వెల్లడించింది. ఆ సంస్థ అధికారిక నోటీస్ ప్రకారం ఈ నెల 21న జరిగే పరీక్షలో ఈ మార్పులను అమలు చేయనున్నారు. తాజా మార్పుల ప్రకారం పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచి 195 నిమిషాలకు పొడిగించారు. ఇందులో పరీక్షకు ముందు హాజరు పట్టికలో సంతకం చేయడం, తనిఖీ తదితర పనులు కూడా ఉంటాయి.
రఫ్ వర్క్ చేసుకోవడానికి నాలుగు పేజీలు ఉంటాయి. ఇందులో రెండు పేజీలు సూచనల పేజీ తర్వాత మిగతా రెండు బుక్లెట్ చివర్లో ఉంటాయి. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్లో, సమాచార బులెటిన్లో ఉన్న సూచనలను జాగ్రత్తగా చదవాలని ఎన్టీఏ సూచించింది. సమాచారం కోసం 91-11-40759000 సంప్రదించాలని తెలిపింది.