న్యూఢిల్లీ, జూలై 29: నీట్-యూజీ కౌన్సెలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతుందని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సోమవారం వెల్లడించింది. కౌన్సెలింగ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో మొదలవుతుందని ఎన్ఎంసీ సెక్రెటరీ డాక్టర్ బీ శ్రీనివాస్ తెలిపారు. తాజా వివరాల కోసం ఎంసీసీ వెబ్సైట్ను సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు. దేశవ్యాప్తంగా 710 వైద్య కళాశాలల్లోని సుమారు 1.10 లక్షల ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ చేపట్టనున్నట్టు చెప్పారు. అలాగే 21,000 బీడీఎస్ సీట్లతోపాటు ఆయుష్, నర్సింగ్ సీట్లను భర్తీచేయనున్నట్టు తెలిపారు. పేపర్ లీక్ నేపథ్యంలో ఈ సారి నీట్ యూజీ పరీక్ష వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత శుక్రవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తుది ఫలితాలను ప్రకటించింది.