న్యూఢిల్లీ, జూలై 8 : నీట్-యూజీ 2026 పేపర్ లీక్‌తో అభాసుపాలైన కేంద్రం ఈసారి దానిని పటిష్ఠంగా నిర్వహించడానికి పరీక్ష విధానంలో పూర్తి మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నది. దేశంలో వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్-యూజీని వచ్చే ఏడాది పూర్తి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ప్రతి ఏడాది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరీక్షను ఇంతవరకు పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించారు. అలాగే ప్రతి సంవత్సరం ఒకే రోజున ఒకే షిఫ్ట్‌లో నిర్వహిస్తున్నారు.
ఇకపై వీటికి స్వస్తి పలుకాలని నిర్ణయించారు. నీట్ 2027ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్ష మాదిరిగానే ఇకపై జేఈఈ, నీట్‌లను కూడా పలు దినాల్లో నిర్వహించనున్నారు. ఈ సంస్కరణలతో పేపర్ లీక్ వంటి ఉదంతాలకు చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తున్నది. కాగా, పరీక్ష వ్యవస్థలో సంస్కరణల కోసం కే రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్ర విద్యా శాఖ 2024 జూన్‌లోనే ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం పరీక్ష విధానాన్ని మెరుగుపర్చడానికి సూచనలు అందించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు.