NEET UG 2026 : నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ గత ఆదివారం, జూన్ 21న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీ గురువారం విడుదలైంది. ఈ విషయాన్ని పరీక్ష నిర్వహణా సంస్థ ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఆన్సర్ కీని సంస్థ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ కీ పేపర్‌పై అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఈ నెల 28, రాత్రి 11.50 నిమిషాల వరకు ఈ ఆన్సర్ కీపై అభ్యంతరాలుంటే తెలపవచ్చు.
ఈ కీ పేపర్లో ఎలాంటి తప్పులు, అభ్యంతరాలున్నా ఈ సైట్ ద్వారా తెలపవచ్చు. ఇందుకోసం ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. తమ అభ్యంతరాలను సమర్ధించే డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ సందేహాలు, అభ్యంతరాల్ని ఒక్కసారి మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసే అవకాశం మాత్రం ఉండదు. అందుకే వాటిని ఆన్లైన్లో సమర్పించే ముందే సరి చూసుకోవాలి. సబ్జెక్ట్ నిపుణులు ఈ అభ్యంతరాలు, సూచనలను పరిశీలిస్తారు. అనంతరం వాటిని అంగీకరించి అవి సరైనవే అని నమ్మితే అభ్యర్థులు చెల్లించిన ఫీజును తిరిగి వాపస్ ఇస్తారు. విశ్లేషకుల అంచనా ప్రకారం.. నీట్ స్కోర్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఇలా ఉండవచ్చు. 650-720 మార్కులు వస్తే ప్రభుత్వ ఎంబీబీఎస్ సీటు రావొచ్చు. 600-649 మార్కులు వస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటు రావొచ్చు. 590-599 మధ్య మార్కులు వస్తే ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే, ఇది రాష్ట్రాన్ని బట్టి, ఇతర రిజర్వేషన్లు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
550-589 మార్కులు వస్తే ఎంబీబీఎస్‌లో పలు కాలేజీల్లో అవకాశం ఉంటుంది. ర్యాంకును బట్టి ఏదో ఒక కాలేజీలో సీటు రావొచ్చు. 550 మార్కులకంటే తక్కువ స్కోర్ వస్తే ప్రభుత్వ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం తక్కువ. అయితే, ఇతర ప్రైవేటు కాలేజీల్లో మాత్రం అవకాశం ఉంటుంది. అలాగే, ఇతర మెడికల్ కోర్సులు చేయవచ్చు. అయితే, ఇవన్నీ గతంలో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చిన అంచనాలు మాత్రమే. ఏ ఏడాదికి ఆ ఏడాది స్కోర్లు మారుతుంటాయి. అప్పుడు వీటిలో మార్పులు ఉండే ఛాన్స్ ఉంది.