న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 పరీక్ష( NEET UG 2026)ను రద్దు చేశారు. మే 3వ తేదీన నిర్వహించిన ఆ పరీక్షను రద్దు చేసినట్లు ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే నీట్ పరీక్షకు చెందిన కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు ఎన్టీఏ పేర్కొన్నది.
దేశవ్యాప్తంగా మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాల్లో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. అయితే 3న నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నీట్ పరీక్షలో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష జరగడానికి ముందే సర్క్యులేట్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజస్థాన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎగ్జామ్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై సమగ్ర విచారణ కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. అయితే కొత్తగా విద్యార్థుల రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఎన్టీఏ చెప్పింది. అదనపు ఎగ్జామ్ ఫీజు కూడా అవసరం లేదని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ డేటా, ఎగ్జామ్ సెంటర్లను యధావిధిగా కొనసాగించనున్నారు. గతంలో విద్యార్థులు చెల్లించిన ఫీజులను తిరిగి రిఫండ్ చేయనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
In continuation of its press release dated 10 May 2026, the National Testing Agency wishes to inform candidates, parents, and members of the public of the following decisions taken in respect of NEET (UG) 2026. NTA had, on 8 May 2026, referred the matters then under consideration…
— National Testing Agency (@NTA_Exams) May 12, 2026
విద్యార్థుల ప్రయోజం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ప్రెస్ రిలీజ్లో ఎన్టీఏ పేర్కొన్నది. జాతీయ పరీక్ష విధానంపై నమ్మకం సడలకుండా ఉండేందుకు మళ్లీ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ చెప్పింది. ఇది విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు ఇబ్బందిని కలిగించే అంశమే, కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా మళ్లీ పరీక్ష నిర్వహించడమే ఉత్తమం అని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎన్ఏటీ పేర్కొన్నది. ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్తే అప్పుడు నష్టం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఎన్టీఏ చెప్పింది. పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డుకు సంబంధించిన అంశాల కోసం అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలోకావాలని, సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే అంశాలను పట్టించుకోవద్దు అని ఎన్టీఏ తెలిపింది.