కోటా : రాజస్థాన్లోని కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూపీలోని మథుర జిల్లా బార్స్నాకు చెందిన పరశురామ్ (21) బుధవారం తాను ఉంటున్న రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు జవహర్ నగర్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పరశురామ్ తండ్రి మాట్లాడుతూ తన కుమారుడు మూడేండ్లుగా నీట్ కోసం కోటాలో శిక్షణ తీసుకుంటున్నాడన్నారు. గత ఏడాది పరీక్షలో 647 మార్కులు సాధించాడని, అయితే నీట్ వివాదం కారణంగా మనస్తాపం చెందాడని చెప్పారు.
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో దారుణం జరిగింది. ఓ మహిళకు మద్యం తాగించి నడిరోడ్డుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాధిత మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. లైంగిక దాడి తర్వాత ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బాధితురాలిని బెదిరించి నిందితుడు పారిపోయాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో పోలీసులు స్పందించి అతడిని అరెస్టు చేశారు.