NEET re exam : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 05.15 గంటలకు ముగిసింది. ఈ పరీక్షకు సంబంధించి పేపర్ కాస్త కఠినంగానే ఉందని అభ్యర్థులు అంటున్నారు. కెమిస్ట్రీ, బయాలజీలలో ప్రశ్నలు కొంచెం క్లిష్టంగా ఉంటే.. ఫిజిక్స్ మాత్రం చాలా కఠినంగా ఉందంటున్నారు. నీట్ రీ ఎగ్జామ్‌కు సంబంధించి కీ పేపర్‌ను ఈ నెల 28న విడుదల చేయాలని ఎన్టీయే నిర్ణయించింది.
నీట్ అధికారిక పోర్టల్ అయిన neet.nta.nic.in నుంచి కీ పేపర్ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీపేపర్పై అభ్యంతరాలను కూడా ఈ సైట్ ద్వారానే తెలపొచ్చు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెలువడాలంటే కనీసం నెల రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చే నెల చివరి వారంలో నీట్ యూజీ 2026 ఫలితాలు విడుదలవుతాయని అంచనా. ఈ రోజు జరిగిన పరీక్షకు 22 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరైనట్లు అంచనా. అనేక చోట్ల విద్యార్థులు పరీక్షలు రాలేకపోయారు. ఒక్క నిమిషం నిబంధన కారణంగా చాలా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థుల్ని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో చాలా మంది అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ కారణంగా ముగ్గురు విద్యార్థినులు ట్రాఫిక్‌లో ఇరుక్కుని పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు.
మరో చోట గూగుల్ మ్యాప్స్ తప్పుగా చూపించడం వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోలేకపోయారు. ఇలా చాలా మంది నీట్ ఎగ్జామ్ రాయలేకపోయారు. అలాగే, కొన్ని దుస్తులు ధరించిన వారిని అనుమతించే విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తాయి. మరో చోట.. తీవ్రగాయాలపాలై, ఇటీవలే సర్జరీ చేయించుకుని కట్లతో ఉన్న విద్యార్థిని పరీక్ష రాసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆమె కోసం ప్రత్యేక గది కేటాయించారు. అలాగే, అంబులెన్స్‌లు కూడా సిద్ధం చేశారు. అయితే, మరికొన్ని కేంద్రాల్లో తలెత్తిన ఇబ్బందులపై ఎన్టీయే స్పందించాల్సి ఉంది.