న్యూఢిల్లీ : నీట్ పీజీ-2025 జూన్ 15న నిర్వహిస్తున్నట్టు ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్’ (ఎన్బీఈఎంఎస్) ప్రకటించింది. ఈమేరకు మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నిర్దేశిత టైమ్ టేబుల్ ప్రకారం రెండు షిఫ్ట్‌ల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3.30 నుంచి 7 గంటల వరకు ఉంటుందని, ఇతర ముఖ్యమైన సమాచారం, మరిన్ని వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను ‘ఎన్బీఈఎంఎస్’ వెబ్సైట్లో పొందుపర్చినట్టు అధికారులు తెలిపారు. అభ్యర్థులు జూలై 31కల్లా ఇంటర్న్‌షిప్ పూర్తిచేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్, కంప్యూటర్ లాగిన్ ప్రక్రియలను పూర్తిచేసేందుకు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి షెడ్యూల్ కన్నా ముందే చేరుకోవాలని సూచించింది. నీట్ పీజీ-2025 పరీక్ష ద్వారా ఎంఎస్ కోర్సులో 12,690, ఎండీ కోర్సులోని 24,360, పీజీ డిప్లొమా కోర్సులోని 922 సీట్లను భర్తీ చేయనున్నారు.