న్యూఢిల్లీ, జూలై 5: దేశవ్యాప్తంగా పీజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-పీజీ 2024 పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 11న రెండు షిష్టుల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) శుక్రవారం వెల్లడించింది.
నీట్ యూజీ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు పరీక్షకు ఒక రోజు ముందు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సవరించిన పరీక్ష షెడ్యూల్ను ప్రకటించారు. పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన అర్హతకు సంబంధించిన కటాఫ్ తేదీ ఆగస్టు 15గానే కొనసాగుతుందని బోర్డు వెల్లడించింది.