న్యూఢిల్లీ, మే 13: నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను ఎన్టీఏ రద్దు చేయడంతో ఎన్ఎస్యూఐ, ఐవైసీ, ఎస్ఎఫ్ఐ, రాష్ట్ర కాంగ్రెస్ విభాగాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు బుధవారం తీవ్రరూపం దాల్చాయి. ఎన్టీఏ పదేపదే విఫలమవుతున్నదని ఆరోపిస్తూ నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏపై పూర్తి నిషేధం విధించాలని, ప్రభావిత విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నినాదాలు, దిష్టిబొమ్మల దహనం నిర్వహించిన నిరసనకారులు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలని డిమాండు చేశారు.
నీట్ పేపర్ లీక్ కేసు.. ఐదుగురి అరెస్ట్
నీట్ యూజీ పేపర్ లీక్‌కు సంబంధించి సీబీఐ దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేసింది. వివిధ ప్రాంతాల్లోని సంస్థలు, ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నది. ఈ కేసులో ఇంతవరకు జైపూర్‌లో ముగ్గురు, గురుగ్రామ్‌లో ఒకరు, నాసిక్‌లో ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పలు నగరాలలో చాలామంది అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారిలో కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేయడంతో నాసిక్‌లో అరెస్ట్ చేసిన 30 ఏండ్ల శుభం హైర్నర్ను ఢిల్లీ తరలిస్తున్నారు.
నీట్ యూజీ లీకేజీపై సుప్రీంకోర్టులో పిటిషన్.. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ దాఖలు
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : నీట్ యూజీ-2026 ప్రవేశ పరీక్ష లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసినట్టు సంస్థ జాతీయ అధ్యక్షుడు డా.శ్రీనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2017, 2024 సహా పదే పదే జరుగుతున్న లీకేజీ వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తన జవాబుదారీతనాన్ని నిరూపించుకోవాలని పిటిషన్లో కోరినట్టు వెల్లడించారు.