Double Booster | చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లోనూ మరో మరో వేవ్ తప్పదా? అనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో కొవిడ్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న కేంద్రం.. మహమ్మారి వ్యాపించకుండా చర్యలు చేపట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వరుస సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మంత్రి ఐఎంఏతో సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో డబుల్ బూస్టర్ డోస్ (నాలుగో టీకా) ఐఎంఏ నొక్కి చెప్పింది. పలు దేశాల్లో నాలుగో డోసు వేసినా ప్రస్తుతం దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో భారత్‌లో డబుల్ బూస్టర్ డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రిని కోరింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలకు రెండు డోసుల టీకా ఇవ్వగా.. ఆ తర్వాత ప్రికాషనరీ డోస్ ఇస్తున్నది.
చైనాతో పాటు పలు దేశాల్లో కొవిడ్ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఫోర్త్ వేవ్ తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఐఎంఏతో భేటీ అయ్యారు. బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత చైనాలో లక్షల్లో జనం ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ బారినపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు, శ్వాసకోశ రోగులు, ఇన్ఫ్లుఎంజా రోగులపై నిఘా ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించాలని కేంద్రం సూచించింది. తద్వారా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చని కేంద్రం పేర్కొంది. మరో వైపు వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని విదేశాల నుంచి సేకరించాలని, తద్వారా దేశంలో ప్రమాదాన్ని పరిశీలించి అంచనా వేయవచ్చని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
డబుల్ బూస్టర్ డోస్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సమావేశం అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ కేంద్రాన్ని కోరారు. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్‌కు ఇవ్వాలని కోరారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు చివరి డోస్ ఏడాది కిందట వేశారన్నారు. రోగనిరోధకశక్తి తగ్గే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది, ఫ్రంట్‌లైన్ కార్మికుల డబుల్ బూస్టర్‌డోస్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు.