ED officers : పశ్చిమబెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై జరిగిన మూకుమ్మడి దాడిని ఆ దర్యాప్తు సంస్థ తీవ్రంగా ఖండించింది. మా అధికారులను చంపాలనే ఉద్దేశంతోనే ఇలా 800 నుంచి 1000 మంది మూకదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన వారి చేతుల్లో కర్రలు, రాళ్లు, ఇటుకలు ఉన్నాయని తెలిపారు. అధికారుల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు, నగదు, ల్యాప్‌టాప్‌లను కూడా దుండగులు ఎత్తుకెళ్లారని వెల్లడించింది.
కాగా, రేషన్ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) కన్వీనర్ షాజహాన్ షేక్‌కు సంబంధించిన మూడు ప్రదేశాల్లో సోదాలు చేశారు. ఓ ప్రదేశంలో సోదాలు చేస్తుండగా దాదాపు వెయ్యి మంది వరకు ఈడీ బృందంపై దాడికి పాల్పడ్డారు.
ఈడీ అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. కర్రలు, రాళ్లు, ఇటుకలతో వాహనాల అద్దాలను పగుల గొట్టారు. అడ్డుకోబోయిన అధికారులపై దాడి చేశారు. వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు, నగదు, పర్సులు, ల్యాప్‌టాప్‌లను లాక్కుపోయారు. ఈ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.