Bihar polls : బీహార్ (Bihar) లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో 121 స్థానాల్లో పోలింగ్ జరుగగా.. మిగిలిన 122 స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 1302 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. సుమారుగా 4 కోట్ల మంది ఓటర్లు వారి గెలుపోటములను నిర్ధారించనున్నారు.
రెండో దశలో భాగంగా పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్హి, మధుబని, సుపౌల్, అరేరియా, కిషన్‌గంజ్ తదితర జిల్లాల్లో పోలింగ్ జరుగనుంది. పోలింగ్ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 4 లక్షల మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలను ఇందుకు వినియోగించారు. ఇప్పటికే సిబ్బంది పోలింగ్‌కు అవసరమైన సామాగ్రితో సంబంధిత బూత్‌లకు చేరుకున్నారు.
తొలి దశలో మాదిరిగా ఈ దిశలో కూడా నితీశ్ సర్కారులోని పలువురు మంత్రులు, ముఖ్య నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్, ఎన్డీయే కూటమిల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. వీరితోపాటు కొత్తగా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ, లాలూ యాదవ్ పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నేతృత్వంలోని జన్‌శక్తి జనతాదళ్ పార్టీ బరిలో నిలిచాయి.