న్యూఢిల్లీ: ఎన్డీయే అంటే ‘నితీశ్-నాయుడు డిపెండెంట్ అలయన్స్’ (‘నితీశ్-నాయుడుపై ఆధారపడ్డ కూటమి) అంటూ కాంగ్రెస్ కొత్త నిర్వచనం ఇచ్చింది. తాజా లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాని బీజేపీ ఎన్డీయే పక్షాలైన టీడీపీ, జేడీయూపై ఆధారపడే పరిస్థితి తలెత్తింది. శుక్రవారం జరిగిన కూటమి సమావేశంలో మోదీ చేసిన గంటసేపు ప్రసంగంలో ఎన్డీయే పేరును తలచినంతగా, గత పదేండ్ల పాలనలో ఎన్నడూ కనీసం ప్రస్తావించిన పాపాన పోలేదని కాంగ్రెస్ విమర్శించింది. కాగా, 10 ఏండ్ల పాలనలో నిత్యం రాజ్యాంగాన్ని ఆడిపోసుకున్న మోదీ శుక్రవారం దానిని కళ్లకు అద్దుకోవడం ‘డ్రామా’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు.