Adani | హైదరాబాద్, ఆగస్టు 15 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ఆప్త మిత్రుడు గౌతమ్ అదానీ ప్రయోజనాల కోసం ఎన్డీయేపాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి కారు చౌకగా భూములను కేటాయించడంతో పాటు ప్రజాగళాన్ని కూడా తొక్కిపెడుతున్నాయి. బీహార్‌లో వెలుగులోకి వచ్చిన తాజా ఉదంతమే ఇందుకు ఉదాహరణ.
బీహార్ రాష్ట్ర విద్యుత్తు అవసరాల కోసమని అక్కడి బీహార్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ (బీఎస్పీజీసీఎల్) ఇటీవల ప్రైవేటు విద్యుత్తు ప్లాంట్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది. 2,400 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేయడానికి బిడ్డింగ్‌లను నిర్వహించింది. తక్కువ బిడ్డింగ్ చేసిందని అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పవర్‌కు ఈ కాంట్రాక్ట్ దక్కింది. యూనిట్‌కు రూ. 6.08 చొప్పున 33 ఏండ్లపాటు విద్యుత్తును సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరింది.
థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు రూ. 27 వేల కోట్ల పెట్టుబడులను పెడుతామని, దీంతో స్థానికంగా ఉద్యోగాలు వస్తాయని అదానీ గ్రూప్ ఆశజూపింది. ఈ క్రమంలో ప్లాంట్ ఏర్పాటు కోసమని భగల్పూర్ జిల్లాలోని పీర్పాయింతీ పట్టణంలో 1,020.6 ఎకరాల భూమిను అదానీ కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టింది. 33 ఏండ్ల లీజుకు ఏడాదికి ఒక్క రూపాయి టోకెన్ ఎమౌంట్కు ఈ భూమిని ధారాదత్తం చేయడం గమనార్హం.
అదానీ గ్రూప్‌నకు కేటాయించిన 1,020.6 ఎకరాల భూములను స్థానిక రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా సేకరించినట్టు తెలుస్తున్నది. అన్నదాతలకు పరిహారం ఇవ్వకుండానే అదానీ కంపెనీకి భూములను కట్టబెట్టడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభుత్వానికి, అదానీ కంపెనీకి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతామని స్థానిక రైతులు ఇప్పటికే హెచ్చరించారు. మరోవైపు, గ్రామాలకు సమీపంలోనే అదానీ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుండటంతో స్థానికంగా ఉన్న ఊళ్లు, జలాశయాలు బుగ్గి కానున్నాయని, జీవజాతులు ఆవాసాలు కోల్పోతాయని పర్యావరణ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు.