Priyanka Gandhi : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో గెలిచేందుకు ఎన్డీయే సర్కారు (NDA govt) విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. నకిలీ జాతీయవాదం (Nationalism) ను ప్రచారం చేస్తోందని విమర్శించారు.
సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేకనే ఓట్ల చోరీకి పాల్పడుతోందని బీజేపీపై మండిపడ్డారు. ఓట్ల తొలగింపు అనేది హక్కుల ఉల్లంఘనతో సమానమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెగుసరాయ్‌లో తన తొలి ప్రచారసభలో ఈ మేరకు ప్రసంగించారు. దేశాభివృద్ధికి బీహార్ ఎంతో దోహదపడిందని అన్నారు.
కానీ రాష్ట్రాభివృద్ధి విషయంలో మాత్రం వెనుకబడిపోయిందని ప్రియాంక చెప్పారు. నెహ్రూ, ఇందిరాగాంధీలను బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, నిరుద్యోగం, వలసల వంటి అసలైన సమస్యలను పట్టించుకోవడం లేదని, పైగా విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేకపోయారని, అందుకే ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్డీయే వాగ్దానాలు చూసి మోసపోవద్దని హెచ్చరించారు.
బీహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కారు లేదని, ప్రతిదాన్ని ఢిల్లీ నుంచి నియంత్రిస్తారని ప్రియాంకగాంధీ విమర్శించారు. ఎన్డీయే పాలనలో ప్రైవేటీకరణ పెద్దఎత్తున జరుగుతోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని మోదీ కొందరికి అప్పగించారని ఆరోపించారు. అంతకుముందు పట్నా విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.