న్యూఢిల్లీ, ఆగస్టు 28: గత 11 ఏండ్ల ప్రధాని మోదీ పాలనలో అతి పెద్ద వైఫల్యం నిరుద్యోగమని ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తెలిపింది. ఈ 11 ఏండ్ల కాలంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారంటూ 27.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది గత సర్వేతో పోలిస్తే ఏడు శాతం ఎక్కువ. ఇక రిటైల్ ద్రవ్యోల్బణంపై 16.8 శాతం, మందగమన ఆర్థికాభివృద్ధిపై 6.5 శాతం, మత హింస, మైనారిటీల్లో భయం అంశాలపై 5.8 శాతం, మహిళల భద్రతపై 5.3 శాతం, ఉగ్రవాద నిర్మూలించడంలో వైఫల్యంపై 4.8 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే దేశంలోని వ్యవసాయ దుస్థితిపై 6.8 శాతం, పేదరికంపై 6.6 శాతం, మౌలిక సదుపాయాల లేమిపై 6.1 శాతం మోదీ పాలనను వ్యతిరేకించారు. అయితే మొత్తం మీద మోదీ ప్రభుత్వం బాగానే ఉందని, అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తున్నదంటూ మెజారిటీ వర్గం ఈ సర్వేలో విశ్వాసం వ్యక్తం చేసింది. ఎన్డీఏ పాలనలో సాధించిన ఘనత అయోధ్య రామాలయ నిర్మాణమేనని అలాగే ఇటీవల జరిపిన ఆపరేషన్ సిందూర్, మౌలిక అభివృద్ధి కూడా కేంద్రం సాధించిన ఘనతలేనని పౌరులు అభిప్రాయపడ్డారు. దేశ ప్రజల మానసిక స్థితి (ఎంఓటీఎన్) పేరుతో ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య అన్ని లోక్‌సభ సెగ్మెంట్లలో 54,788 మందిని సర్వే చేశారు. దీనికి అదనంగా సీ ఓటర్ నిత్యం చేసే 1,52,038 మంది ఇంటర్వ్యూల డాటాను కూడా విశ్లేషించి మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను క్రోడీకరించి సర్వే ఫలితాలను వెల్లడించారు.
భారత వస్తువులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలపై భారతీయులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నట్టు సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంఓటీఎన్) తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో మూడువంతుల మంది (63 శాతం) ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 27 మంది మాత్రమే తాము పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తమ ప్రయోజనాలపై రాజీ పడకుండా అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగించాలని మెజారిటీ(61 శాతం) మంది అభిప్రాయపడగా అమెరికా సుంకాలను తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ నిలబడగలదని 23 శాతం మంది విశ్వసించారు.
అమెరికా షరతులను భారత్ ఒప్పుకోవాలని కేవలం 9 శాతం మంది మాత్రమే సూచించారు. వాణిజ్య చర్చలు విఫలం కావడానికి 54 శాతం మంది అమెరికాను నిందించగా 22 శాతం మంది భారత్‌ను నిందించారు. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించాలని 69 శాతం మంది సూచించగా రష్యన్ ముడి చమురు కొనుగోలు నిలిపివేయాలని 16 శాతం మంది అభిప్రాయపడ్డారు. చైనాతో మరింత సన్నిహిత వాణిజ్య, దౌత్యపర సంబంధాలు ప్రపంచంలో భారత్ స్థానాన్ని పటిష్టం చేస్తాయని 52 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు