NDA CMs : దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన వివరాలను సీఎంలు, డిప్యూటీ సీఎంలకు వివరించారు.
అదేవిధంగా ఈ సమావేశంలో రెండు తీర్మానాలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై మోదీని అభినందిస్తూ ఒక తీర్మానం, దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేసినట్లు తెలిసింది. అంతేగాక ఆపరేషన్ సింధూర్‌పై కాంగ్రెస్ సహా విపక్షాల విమర్శలను తిప్పికొట్టే అంశంపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబుకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున ప్రధానితో భేటీకి హాజరుకాలేదు.