Bihar Election Results : యావత్ దేశం ఆసక్తికనబరిచిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ(NDA) కూటమి ప్రభంజనం సృష్టించింది. అధికారంలోకి రావాలనుకున్న మహాఘట్బంధన్ (Mahagathbandhan) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు విడతల్లో 243 స్థానాలకు జరిగిన ఎలక్షన్లో నితీశ్ కుమార్(Nitish Kumar) నేతృత్వంలోని ఎన్డేయే ఇప్పటికే 202 స్థానాల్లో గెలుపొందింది.. మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాఘట్బంధన్ బలపరిచిన సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) విజయం సాధించారు. కానీ, ఆయనకు అధికారం మరోసారి కలగానే మిగిలింది. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయనేతగా రాణించాలనుకున్న ప్రశాంత్ కిశోర్‌ను ఓటర్లు తిరస్కరించారు. ఇక చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైన బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే ఓటర్లు జై కొట్టారు. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుల్లో ఒకరికి మోదం. మరొకరికి ఖేదం మిగిలింది. పెద్దబ్బాయి, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ ఆఖర్లో పుంజుకొని ఓటమి తప్పించుకున్నారు. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో బరిలో నిలిచిన మహాఘట్బంథన్కు రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ ప్రచారం ఏమాత్రం అనుకూలించలేదు.
#WATCH | Lakhisarai, Bihar | Dy CM Vijay Kumar Sinha, BJP’s winning candidate from Lakhisarai, holds a roadshow after his victory. pic.twitter.com/L3f7vEAGjP
— ANI (@ANI) November 14, 2025
జనశక్తి జనతాదళ్ పార్టీ తరఫున బరిలోకి దిగిన చిన్నబ్బాయి తేజ్ ప్రతాప్ ఘోర పరాభవం చవిచూశారు. ఈ ఎన్నికల్లో రామ్‌విలాస్ పాశ్వాన్ తనయకుడు చిరాగ్ పాశ్వాన్ తనముద్ర వేశారు. ఆయన నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 28 స్థానాల్లో పోటీ చేయగా.. 19 స్థానాల్లో విజయం వాకిట నిలిచింది. ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పార్టీ కనీసం ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది.
గత ఎన్నికలతో పోల్చితే జేడీయూ కూటమి సీట్ల సంఖ్య రెట్టింపైంది. అప్పుడు 122 సీట్లలో మాత్రమే అభ్యర్ధులు గెలుపొందగా.. ఈసారి రికార్డు స్థాయిలో 202 మంది అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఆర్జేడీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. గత ఎలక్షన్లో 114 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షం హోదా సాధించిన ఆ పార్టీ ఇప్పుడు డబుల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇతర పార్టీలకు కూడా ఈసారి ఒక స్థానం తగ్గింది.
समस्त एनडीए परिवार की ओर से… धन्यवाद बिहार!#NDA_कहे_आभार_बिहार pic.twitter.com/Tq0xgZuboD
— BJP (@BJP4India) November 14, 2025
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆఖర్లో పుంజుకొని గెలిచారు. 11 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్‌పై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో కొనసాగిన తేజస్వీ.. ఆ తర్వాత వెనుకబడ్డారు. అయితే.. చివరి రౌండ్లలో అనూహ్యంగా లీడ్‌లో కొనసాగారు. తేజస్వీ యాదవ్‌కు 1,19,780 ఓట్లు పోలయ్యాయి. ఈ విజయంతో తేజస్వీ వరుసగా మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.