న్యూఢిల్లీ: గృహ హింస, వేధింపుల చట్టాలు ఆడవారికైనా, మగవారికైనా ఒకేలా ఉండాలని బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ కోరారు. పురుషుల ఆత్మహత్యలపై సోమవారం ఆయన రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2022లో ఆత్మహత్యలతో మరణించిన వారిలో 72 శాతం పురుషులేనని చెప్పారు. 47 వేల మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు.
2014 నుంచి 2021 మధ్యకాలంలో కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్న పురుషుల సంఖ్య 107.5 శాతం పెరిగిందని తెలిపారు. ‘గృహ హింస, వేధింపుల నుంచి మహిళలను కాపాడటంలో మన చట్టాలు పురోగతి సాధించాయి. ఇలాంటి చట్టాలు పురుషులను రక్షించడానికి లేకపోవడమే ఆందోళనకరం’ అని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులకు న్యాయపరమైన, భావోద్వేగ మద్దతు లభించడం లేదని చెప్పారు.