NCRB Report | నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2023 తాజా నివేదికను విడుదల చేసింది. భారత్‌లో ప్రమాదాలు, మరణాలు, ఆత్మహత్యలు దిగ్భ్రాంతికరమైన గణాంకాలను వెల్లడించింది. భారత్‌లో అడవి జంతువులు, పాముకాటు మరణాలు 2022తో పోలిస్తే 2023లో పెరిగాయని నివేదిక తెలిపింది. అలాగే, పిడుగులు, వడదెబ్బ లాంటి సాధారణ కారణాలతోనూ వేలాది మంది చనిపోయినట్లు నివేదిక పేర్కొంది. పాము కాటు, అడవి జంతువుల దాడుల కారణంగా ప్రకృతి వైపరీత్యాలు, వన్యప్రాణుల సంబంధిత మరణాలపై రాష్ట్రాల వారీగా డేటా గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఉత్తర, తూర్పు భారతదేశంలోని రాష్ట్రాల్లో పాముకాటు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే 2,100 మరణాలు, ఆ తర్వాత బీహార్‌లో 1,800 మరణాలు, మధ్యప్రదేశ్‌లో 950 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 700, జార్ఖండ్‌లో 620, పశ్చిమ బెంగాల్లో 600 మరణాలు రికార్డయ్యాయి.
దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్ 480, తమిళనాడు 450 మరణాలు ఉన్నాయి. అలాగే, పలు రాష్ట్రాల్లో వన్యప్రాణుల దాడుల్లోనూ మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర (180 మరణాలు-గాయాలు), ఒడిశా (200), జార్ఖండ్ (150) ముందంజలో ఉన్నాయి. ఏనుగులు, చిరుతపులి దాడులు సవాల్‌గా మారినట్లు నివేదిక తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలలో అత్యధిక మరణాలు బీహార్‌లో 950 నమోదయ్యాయని చెప్పింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ (900), మధ్యప్రదేశ్ (870), జార్ఖండ్ (610) అగ్రస్థానంలో ఉన్నాయి. వడదెబ్బ కారణంగా రాజస్థాన్ (450), ఉత్తరప్రదేశ్ (420), బీహార్ (350) మరణాలు నమోదయ్యాయి. చలి కారణంగా 410 మంది, ఉత్తరప్రదేశ్ 380 మంది, మధ్యప్రదేశ్ 360 మంది చనిపోయారు. పర్యావరణ నిపుణులు పాము, వన్యప్రాణుల దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణీకరణ, అడవుల నరికివేత కారణంగా జంతువులు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయని పేర్కొంటున్నారు. పాము కాటు కేసుల్లో సకాలంలో చికిత్స అందితే ప్రాణాపాయం తప్పుతుందని.. నిపుణులు చెబుతున్నారు.