ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితా విడుదల చేసింది. 38 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. కుటుంబానికి కంచుకోట అయిన బారామతి స్థానం నుంచి అజిత్ పవార్ పోటీ చేయనున్నారు. ఎన్సీపీకి చెందిన 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా అభ్యర్థులుగా తొలి జాబితాలో పేర్కొన్నారు. యెవ్లా స్థానం నుంచి ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్, నవాపూర్ సీటు నుంచి దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్‌రావు గవిత్ కుమారుడు భరత్ గవిత్ పోటీ చేయనున్నారు.
కాగా, ఎన్సీపీకి చెందిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌ను దిండోరి నుంచి, గతంలో బీజేపీలో ఉన్న మాజీ మంత్రి రాజ్‌కుమార్ బడోలేను అర్జుని-మోర్గావ్ నుంచి బరిలోకి దించింది. అంబేగాన్ నుంచి దిలీప్ వైస్-పాటిల్, పార్లీ నుంచి ధనంజయ్ ముండే, కాగల్ నుంచి హసన్ ముష్రిఫ్ పోటీ చేయనున్నారు.
అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్సీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సుల్భా ఖోడ్కే (అమరావతి), హిరామన్ ఖోస్కర్ (ఇగత్పురి)లను కూడా ఎన్సీపీ అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది.