ముంబై: దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar)కు .. మరణానంతర పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇప్పించాలని కోరుతూ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేతలు.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. జూలై 8వ తేదీన ఆ లేఖను సీఎంకు పంపినట్లు ఎన్సీపీ చీఫ్ విప్ చేతన్ విఠల్ తూపే తెలిపారు. ఎన్సీపీకి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ విజ్ఞాపన చేసినట్లు ఆయన తెలిపారు. అజిత్ పవార్‌కు మరణానంతర పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయాలని కోరుతూ ఆ లేఖలో సీఎంను కోరారు. జనవరి 28వ తేదీన పూణె జిల్లాలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతిచెందిన విషయం తెలిసిందే.
ఎన్సీపీ పార్టీకి అజిత్ పవార్ నేతృత్వం వహించారని, క్రియాశీలక నేతగా ఆయన ఉన్నారని, పరిపాలనలోనూ ఆయన ధీరుడు అని లేఖలో తెలిపారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిలో అజిత్ పవార్ పాత్ర ఎంతో ఉందని లేఖలో ఎన్సీపీ నేతలు పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా రికార్డు స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మౌళిక సదుపాయాల కల్పన, రోడ్ల అభివృద్ధి, మెట్రో కనెక్టివిటీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అనేక విధాన నిర్ణయాలను అజిత్ పవార్ తీసుకున్నట్లు లేఖలో తెలిపారు.
రాష్ట్ర సహకార వ్యవస్థను బలోపేతం చేశారని, కరువు సమయాల్లో రైతులకు ఆర్థిక సాయాన్ని అందించారని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేశారని తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం జీవితాంతం కష్టపడ్డ అజిత్ పవార్ సేవలను గుర్తిస్తూ ఆయనకు మరణానంతర పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందజేయాలని ఎన్సీపీ నేతలు కోరారు.