ముంబై, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ముంబయి బాంద్రాలోని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దసరా సందర్భంగా కార్యాలయం బయట కొందరు టపాసులు కాలుస్తుండగా ముఖానికి గుడ్డలు కట్టుకుని బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండుగులు తుపాకులతో కాల్పులు జరిపారు.
గుండెకు తూటా తగలడంతో గాయపడిన సిద్ధిఖీని హూటాహుటిన లీలావతి దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హుటాహుటిన దవాఖానకు చేరుకున్నారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారిగా విచారణలో తేలింది. సిద్ధిఖీని చంపేందుకు ఒకొ నిందితుడికి లారెన్స్ గ్యాంగ్ రూ. 50 వేలు అడ్వాన్స్ ఇచ్చిందని, అలాగే మారణాయుధాలు సైతం సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. బాబా సిద్ధిఖీకి 15 రోజుల క్రితమే ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఎవరీ బాబా సిద్ధిఖీ?
దాదాపు 48 ఏండ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన బాబా సిద్దిఖీ, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)లో చేరారు. బాబా సిద్ధిఖీకి రాజకీయ నాయకుడిగానే కాకుండా పెద్దయెత్తున రంజాన్ విందులు, ప్రైవేటు పార్టీలు నిర్వహించే వ్యక్తిగా ముంబయి వ్యాప్తంగా పేరుంది. సల్మాన్ ఖాన్‌కు బాబా సిద్ధిఖీ మంచి మిత్రుడు.
కఠిన చర్యలు తీసుకుంటాం:షిండే
సిద్ధిఖీ మృతికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘పారిపోయిన వ్యక్తి కోసం పోలీసు టీములు గాలిస్తున్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. బాబా సిద్దిఖీ మరణంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎక్స్‌లో స్పందించారు. ‘నా సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయాను. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. బాబా సిద్దిఖీకి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఇది శాంతి భద్రతల వైఫల్యం
సిద్ధిఖీ హత్య శాంతి భద్రతల వైఫల్యమని విపక్షాలు ఆరోపించాయి. మహారాష్ట్ర సీఎం షిండే, హోం మంత్రులకు ఆ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని, వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) అధికార ప్రతినిధి ఆనంద్ దూబే డిమాండ్ చేశారు. బాబా సిద్ధిఖీ హత్యతో దేశం మొత్తం భయపడుతున్నదని ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని ఆయన ఆరోపించారు.
హత్య మేమే చేశాం: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
సిద్ధిఖీని తామే హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. తమకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదని, అయితే ఎవరైతే గ్యాంగ్‌స్టర్ దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు పెట్టుకుంటారో, ఎవరైతే సల్మాన్ ఖాన్‌కు సహాయం చేస్తారో వారి ఖాతాలను సరి చేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా భావిస్తున్న శుభం రామేశ్వర్ లంకర్ ఫేస్బుక్లో హెచ్చరించాడు. బాబా సిద్ధిఖీ హత్యకు కొన్ని నెలల నుంచే నిందితులు రెకీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే గ్యాంగ్ 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపింది. తమ ఆరాధ్య జంతువు కృష్ణ జింకను సల్మాన్ చంపడంతో వారు దాడి చేశారు. సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఇంటి వద్ద మరోసారి భారీగా భద్రత పెంచారు.