న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ ముద్రించిన కొత్త ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టారు. (Hindi names to English textbooks) ఒకటి నుంచి ఆరో తరగతి టెక్ట్ బుక్స్కు గతంలో ఉన్న ఇంగ్లీష్ పేర్లను మార్చారు. హిందీ పేర్ల శీర్షికతో వాటిని ముద్రించారు. 6వ తరగతి ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాన్ని ఇంతకు ముందు హనీసకేల్ అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పుస్తకానికి ‘పూర్వి’ అని శీర్షిక ఇచ్చారు. ఈ హిందీ పదానికి ‘తూర్పు’ అని అర్థం. అలాగే ఒకటి, రెండో తరగతి ఇంగ్లీష్ టెక్స్ బుక్స్కు సంగీత వాయిద్యాల పేర్లైన ‘మృదంగ్’ మూడో తరగతి ఆంగ్ల పాఠ్య పుస్తకానికి ‘సంతూర్’ అని పేరు పెట్టారు.
కాగా, సైన్స్, సోషల్ పాఠ్య పుస్తకాలకు ఇంగ్లీష్ పేర్లు కొనసాగించారు. అయితే హిందీ, ఉర్దూ వెర్షన్లకు పేర్లు మార్చారు. ఆరో తరగతి కొత్త సైన్స్ పుస్తకాన్ని ఆంగ్లంలో క్యూరియాసిటీగాను హిందీ, ఉర్దూ వెర్షన్లకు ‘జిగ్జాసా’, ‘తజస్సుస్’గా పేరు పెట్టారు. అదేవిధంగా సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకానికి ఆంగ్లంలో ఎక్స్ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్గా, హిందీలో సమాజ్ కా అధ్యయాన్: భారత్ ఔర్ ఉస్కే ఆగే అని పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో హిందీని బలవంతంగా రుద్దే క్రమంలో ఎన్సీఈఆర్టీ టెక్ట్స్ బుక్స్కు హిందీ పేర్లు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.