న్యూఢిల్లీ : ‘విభజన భయానక స్మారక దినోత్సవం’ పేరుతో ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) తాజాగా విడుదల చేసిన ప్రత్యేక మాడ్యూల్ దేశ విభజనకు మహమ్మద్ అలీ జిన్నా, కాంగ్రెస్, అప్పటి వైస్రాయ్ మౌంట్‌బాటన్ బాధ్యులని తేల్చి చెప్పింది. విభజన తర్వాత కశ్మీర్ కొత్త సమస్యగా మారిందని, దేశ విదేశాంగ విధానానికి సవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని దేశాలు పాకిస్థాన్‌కు సాయం అందిస్తూ కశ్మీర్ పేరుతో భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించింది.
తప్పుడు ఆలోచనల కారణంగానే దేశ విభజన జరిగిందని, భారత ముస్లిం పార్టీ ముస్లింలీగ్ 1940లో లాహోర్‌లో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో దాని నాయకుడు మహ్మద్ అలీ జిన్నా మాట్లాడుతూ హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు మతాలు, సామాజిక ఆచారాలకు చెందిన వారని పేర్కొన్నట్టు మాడ్యూల్ తెలిపింది. విభజనను డిమాండ్ చేసిన జిన్నా, దానిని అంగీకరించిన కాంగ్రెస్, దానిని ఆచరించిన మౌంట్‌బాటన్ బాధ్యులని తెలిపింది.