Jammu Kashmir : జమ్ము కశ్మీర్లో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన రాజ్య సభ ఎన్నికల్లో(Rajya SabhaElections) అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన ఎలక్షన్లో ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) నేతృత్వంలోని పార్టీ మూడు సీట్లు గెలుపొందింది. అయితే.. అధికార పక్షానికి షాకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఒక సీటును కైవసం చేసుకుంది. ఆర్టికల్ 370ని ఎత్తివేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి బీజేపీ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకుంది. ఫలితాలు ప్రకటించగానే ఎన్సీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబురాలు చేసుకన్నారు. గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత ఒమర్ అబ్దుల్లా.
రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల పేర్లను నేషనల్ కాన్ఫరెన్స్ వెల్లడించింది. చౌదరీ మొహమ్మద్ రంజాన్, సజద్ కిచ్లూ, పార్టీ కోశాధికారి జీఎస్ షమ్మీ ఒబెరాయ్‌లు విజయం సాధించారని పార్టీ తెలిపింది. అధికార పార్టీతో పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బీజేపీ నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది. సీనియర్ నాయకుడు సత్ శర్మ గెలుపొందారని బీజేపీ కార్యాలయం పేర్కొంది. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఇమ్రాన్ నబీ దార్‌పై పోటీ చేసిన శర్మ.. 54 ఓట్లలో 32 ఓట్లు సాధించి విజయఢంకా మోగించారు.
Heartiest congratulations to my colleagues Ch Mohd Ramzan Sb, Sajad Kichloo & Shammi Oberoi on their victory in the Rajya Sabha polls. I wish them well as they begin a new innings representing the people of J&K in the Parliament of India.
— Omar Abdullah (@OmarAbdullah) October 24, 2025
‘రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన సహచరులు, మొహమ్మద్ రంజాన్, సజద్ కిచ్లూ, షమ్మీ ఒబెరాయ్‌లకు అభినందనలు. జమ్ముకశ్మీర్ ప్రజల ప్రతినిధులుగా పార్లమెంట్లో అడుగుపెడుతూ.. కొత్త ఇన్నింగ్స్ ఆరంభించున్న ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని అబ్ద్లు ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.