Nawab Malik Swipe at NCB | దేశంలో డ్రగ్స్ వ్యాపారం గుజరాత్ కేంద్రంగా జరుగుతోందా? అని మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ప్రశ్నించారు. తాజాగా గుజరాత్‌లోని ద్వారకలో రూ. 313.64 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
కొన్నిరోజుల క్రితం ఇక్కడి ముంద్రా పోర్టులో 3వేల కేజీల డ్రగ్స్ దొరికాయి. ఈ ఘటనలను గుర్తుచేసిన నవాబ్ మాలిక్.. ఈ రెండు కేసులు యాదృచ్ఛికమేనా? లేక సముద్ర మార్గం ద్వారా దేశంలోకి డ్రగ్స్ ప్రవేశించడంలో గుజరాత్ ఒక హబ్‌గా మారిందా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్సీబీ దర్యాప్తు చేపట్టాలని సూచించారు.
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసుతో సంబంధాలున్న మనీష్ భానుశాలి, ధవల్ భానుశాలి, కిరణ్ గోసావి, సునీల్ పాటిల్ తరచూ అహ్మదాబాద్‌లోని ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేసేవారని నవాబ్ మాలిక్ చెప్పారు. వీరందరికీ గుజరాత్ మంత్రి కృతిసింహ్ రాణాతో సత్సంబంధాలున్నాయని, వీళ్లంతా డ్రగ్స్ గేమ్‌లో పాలుపంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
పబ్లిసిటీ కోసం బాలీవుడ్ యాక్టర్ల దగ్గర లభించే కొన్ని గ్రాముల డ్రగ్స్‌ను పట్టుకొని, ముంబై డ్రగ్స్ అడ్డాగా మారిందనే అపోహలు సృష్టించడం మానుకోవాలని ఎన్సీబీకి చురకలంటించారు. ఈ గ్రాముల కేసులు కాకుండా కేజీలకొద్దీ డ్రగ్స్ దొరికే కేసులను సీరియస్‌గా తీసుకోవాలని సలహా ఇచ్చారు.