న్యూఢిల్లీ: కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు సెలవుపై వెళ్లడమే ఓ నేవీ అధికారి ( Naval officer JR Suresh ) పాలిట శాపమైంది. సముద్రపు అలల రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు అతడిని కబలించింది. ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లి సరదాగా గడుపుడుతున్న ఆయన ఒక్కసారిగా అలల్లోపడి కొట్టుకుపోయాడు. భార్యాబిడ్డలు చూస్తుండగానే అతడు నీళ్లలో మునిగిపోయాడు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి సమీపంలోని కోవలమ్ బీచ్‌లో గురువారం ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. జేఆర్ సురేష్ అనే వ్యక్తి ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలో విధులు నిర్వహించే ఆయన ఇటీవల సెలవుపై తమిళనాడులోని స్వస్థలానికి వచ్చాడు. ఈ క్రమంలో భార్యాబిడ్డలతో కలిసి కోవలమ్ బీచ్‌కు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ భార్యబిడ్డలతో సరదాగా గడుపుతున్న అధికారిని రాకాసి అలలు నీట ముంచాయి. సమాచారం అందుకున్న నేవీ బలగాలు వెంటనే రంగంలోకి దిగి ఆయన కోసం సెర్చింగ్ మొదలుపెట్టగా కేలంబక్కమ్ ప్రాంతంలో ఆయన మృతదేహం లభ్యమైంది.