సెక్షన్ 11 ఏం చెపున్నది?
దేశంలో అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు.. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు తమ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశించవచ్చు. సంస్థల ఉత్పత్తి, దిగుమతులను నియంత్రించవచ్చు.
న్యూఢిల్లీ, మే 6: దేశం కరెంటు ఎమర్జెన్సీలోకి జారుకొన్నది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 11ను అమల్లోకి తీసుకువచ్చింది. అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అమల్లోకి తెచ్చే ఈ సెక్షన్‌తో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలన్నింటి నియంత్రణ కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. విద్యుత్తు ఉత్పత్తి నుంచి సరఫరా వరకు అన్నీ కేంద్రం ఆదేశాల మేరకే జరుగుతాయి. బొగ్గు కొరత వల్లే దేశంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో.. బొగ్గు లభ్యతను పెంచడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. విద్యుదుత్పత్తి సంస్థల్లో బొగ్గు నిల్వలపై కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కే సింగ్ శుక్రవారం రాష్ర్టాల అధికారులు, థర్మల్ పవర్ కేంద్రాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 11ను అమల్లోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. అన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు సామర్థ్యం మేరకు కరెంటును ఉత్పత్తి చేయాలని ఆర్కే సింగ్ ఆదేశించారు. దేశీయంగా బొగ్గు కొరత ఉన్న కారణంగా థర్మల్ విద్యుత్తు సంస్థలు తమ మొత్తం బొగ్గు వినియోగంలో కనీసం 10% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని సూచించారు. బొగ్గు దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని, అప్పుడే మే నెలలోగా బొగ్గు వస్తుందని రాష్ర్టాలకు సూచించారు. ఈ సెక్షన్ అక్టోబర్ 31 వరకు ఉంటుంది.
100 మిలియన్ టన్నులు అదనం
బొగ్గు సంక్షోభం, విద్యుత్తు కొరత అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఆర్థికంగా లాభదాయకం కాదని భావించి గతంలో మూసివేసిన వందకు పైగా బొగ్గు గనులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. దేశంలో ప్రస్తుతం ఏటా 777.2 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. కొత్త గనుల నుంచి 75-100 మిలియన్ టన్నులు అదనంగా వస్తుందని అంచనా.
అంతర్జాతీయంగా మండుతున్న బొగ్గు
అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయి. టన్నుకు 140 డాలర్లు ఉంది. ఇది బొగ్గు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా దేశీయంగా బొగ్గుకు డిమాండ్ పెరిగింది. దేశంలో తగినంత బొగ్గు ఉత్పత్తి లేదు. విద్యుత్తు ఉత్పత్తి తగ్గింది. ఇండియలో కేవలం దిగుమతి చేసుకొన్న బొగ్గు ద్వారానే 17,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. అయితే ప్రస్తుతం బొగ్గు దిగుమతులు లేని కారణంగా 7,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు పనిచేయడం లేదు. ప్రస్తుతం బొగ్గు దిగుమతిని పెంచడంతో పాటు దేశీయంగానూ ఉత్పత్తి పెరగనుండటంతో ఈ ప్లాంట్లు కూడా మళ్లీ వినియోగంలోకి రానున్నాయి.
రాజస్థాన్‌లో కరెంటు కోతలు తీవ్రం
రాజస్థాన్‌ను విద్యుత్తు కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఇప్పటికే కరెంటు కోతలు అమలవుతున్న ఆ రాష్ట్రంలో పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి. కరెంటు కోతల సమయాన్ని పెంచనున్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. విద్యుత్తు కొరత కారణంగా రాజస్థాన్ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి కరెంటు కోతలను అమలు చేస్తున్నది.