Banks | న్యూఢిల్లీ, మార్చి 14: డిమాండ్ల సాధనకు ఈ నెల 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని ద యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్బీయూ) నిర్ణయించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో తాము జరిపిన చర్చల్లో సానుకూల ఫలితాలు రాకపోవడంతో సమ్మె చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది.
ఐదు రోజుల పనిదినాల అమ లు, అన్ని స్థాయిల్లో ఉద్యోగాలు, డైరెక్టర్ పోస్టుల భర్తీ చేపట్టాలన్నది తమ ప్రధాన డిమాండ్లని పేర్కొంది. ఈ మేరకు ఐబీఏతో జరిపిన చర్చల్లో ప్రధాన సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉండిపోయాయని నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) ప్రధాన కార్యదర్శి ఎల్ చంద్రశేఖర్ తెలిపారు.
అలాగే ఉద్యోగుల పనిపై సమీక్ష, పని ఆధారిత ప్రోత్సాహకాలపై ఇటీవల ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తొమ్మిది యూనియన్లతో కూడిన యూఎఫ్బీ యూ డిమాండ్ చేసినట్టు ఆయన చెప్పా రు. ప్రభుత్వ రంగ బ్యాంకులది సూక్ష్మ నిర్వహణ అని ఆర్థిక సేవల విభాగం పిలిచే విధానాన్ని కూడా సంస్థ వ్యతిరేకించింది.