మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 19:40:26

జాతీయవాదమే భారతీయ ఆత్మ : ఉపరాష్ట్రపతి

జాతీయవాదమే భారతీయ ఆత్మ : ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ : భారత సాంస్కృతిక ఐక్యతే ఇవాళ దేశప్రజలను సమైక్యంగా మార్చిందని.. మన దేశం, మన నేల, మన జాతి, మన సంస్కృతి-సంప్రదాయాలకు ముప్పువాటిల్లుతుందని గ్రహిస్తే.. ప్రజలంతా ఏకమై ఆ దాడిని ఎదుర్కునేందుకు సిద్ధపడతారని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇదే జాతీయవాదమని.. భారతీయ ఆత్మలో జాతీయవాదం బలంగా ఉన్నదని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయని అన్నారు.

కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి రచించిన ‘ది టెన్ ఐడియాలజీస్’ పుస్తక తెలుగు అనువాదం ‘పది భావజాలాలు’ ను ఉపరాష్ట్రపతి ఆన్‌లైన్ వేదిక ద్వారా మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మతం, జాతి, భాష అనే వాటిని ప్రతికూల దృక్పథంతో ఆలోచించే ధోరణి సరైనది కాదని నా అభిప్రాయం. అవి మన అస్తిత్వానికి, సంస్కృతికి, సమైక్యతకు సమగ్రతకు తోడ్పడి దేశ శ్రేయస్సుకు ఉపయోగపడడం ఆరోగ్యకరమైన పరిణామమే. ఈ విషయంలో మన దృష్టి కోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే విస్తృత అధ్యయనం చేసే ఆసక్తితో జైపాల్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చక్కటి అవగాహన పెంచుకున్నారని.. ప్రతి విషయాన్ని సైద్ధాంతికంగా, కార్యకారణ సంబంధాలతో, లాజికల్ గా ఆలోచించడం ఆయన ప్రత్యేకతని వెంకయ్యనాయుడు చెప్పారు. 

‘ఈ పుస్తకంలో వర్తమాన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ఆధునిక సైద్ధాంతిక దృక్పథం అవసరమని జైపాల్ రెడ్డి వివరించారు. భావజాలాల గురించి విశ్లేషించేటప్పుడు జైపాల్ రెడ్డి ప్రపంచంలో చర్చకు వచ్చిన అన్ని సిద్ధాంతాల గురించి ప్రస్తావించడం కాకుండా.. సమాజంలో మార్పులకు దోహదం చేసిన అనేక పరిణామాలను వాస్తవిక దృక్పథంతో విశ్లేషించి వాటికి తాత్విక కోణాన్ని జోడించారు. ఇవాళ మనం చూస్తున్న ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ విధానాలతో పాటు పర్యావరణ వాదం, స్త్రీవాదం, ప్రపంచీకరణ, సంస్కరణల వెనుక ఉన్న మూలాల్ని ఆయన పది భావజాలాలుగా వర్గీకరించారు. ఈ పది భావజాలాల్లో ప్రధానమైనది జాతీయవాదం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరంతోపాటు పుస్తక ప్రచురణకర్తలు ‘ఓరియంట్ బ్లాక్ స్వాన్’ సంస్థ వారిని కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు.


logo