Medical Colleges | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి ( ఎన్ఎంసీ) సీరియస్ అయింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, ప్రయోగశాలలు, విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు సరిపడా మృతదేహాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆయా కాలేజీల్లో గుర్తించిన లోపాలపై చర్చించేందుకు ఈనెల 18న ఢిల్లీలోని ఎన్ఎంసీ కార్యాలయానికి రావాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈలకు ఎన్ఎంసీ నోటీసులు జారీ చేసింది. వసతులు లేవని గుర్తించిన 26 మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్లు ఈ సమావేశానికి వర్చువల్ గా హాజరు కావాలని ఎన్ఎంసీ ఆదేశించింది.
కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ – యూజీ) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. శనివారం ఏ క్షణాన్నైనా ఈ ఫలితాలు వెల్లడికానున్నాయి. మే 4న జాతీయంగా ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల ముందు విడుదల చేసే ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం ఉదయం విడుదల చేసింది. దీంతో ఫలితాల విడుదల ఒక్కటే మిగిలింది. అయితే ఫైనల్ కీలో ఎన్టీఏ ఒక్క మార్పు చేసింది. ఫిజిక్స్ లో ఒక ప్రశ్న సమాధానంగా రెండు ఆప్షన్లను ఖరారు చేసింది. రెండు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ను ఎంపిక చేసుకున్నా మార్కులేస్తారు.