NEET UG Paper Leak | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : రాజస్థాన్‌లో వెలుగు చూసిన నీట్-యూజీ పేపర్ తొలుత మహారాష్ట్రలోని నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీకైనట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. లీక్ చేసిన అనుమానిత వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. పేపర్ లీకైన విధానాన్ని జాతీయ మీడియా వివరించింది.
ఆ కథనాల ప్రకారం.. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీకైన ప్రశ్నపత్రానికి మరికొన్ని ప్రశ్నలను అదనంగా చేర్చారు. అనంతరం ఈ పేపర్ హర్యానాలోని గురుగ్రామ్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యుడికి చేరింది. అతడి నుంచి ఈ పేపర్‌ను రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన కార్తీక్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. రాజస్థాన్‌లోని సికార్‌లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్‌గా పనిచేసే రాకేశ్ కుమార్ అనే వ్యక్తి కార్తీక్ నుంచి ఈ ప్రశ్నాపత్రాన్ని కొన్నాడు. రాకేశ్ కుమార్ నుంచే ఢిల్లీ, జమ్ముకశ్మీర్, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ర్టాలకు ఈ లీకేజీ పేపర్ గెస్ పేపర్‌గా సరఫరా అయినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎగ్జామ్‌కు 15 రోజుల ముందు ఈ గెస్ పేపర్ సర్క్యులేట్ అయినట్టు పోలీసులు గుర్తించారు.
కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థి నుంచి రూ. 30 వేలు తీసుకొని రాకేశ్ ఈ గెస్ పేపర్‌ను ఇచ్చాడు. పరీక్షకు ఒకరోజు ముందు ఈ పేపర్ ఆ విద్యార్థి చేతికి వచ్చింది. దీంతో సికార్‌లో పీజీ హాస్టల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తన తండ్రికి ఆ విద్యార్థి ఈ పేపర్‌ను వాట్సాప్‌లో పంపించాడు. ‘డాడీ.. సికార్‌లో ఉన్న ఓ స్నేహితుడి దగ్గర నుంచి ఈ గెస్ పేపర్ నాకు వచ్చింది. మీ హాస్టల్లో నీట్ యూజీ పరీక్ష రాయబోయే అమ్మాయిలకు ఈ పేపర్ ఇవ్వు. రేపటి ఎగ్జామ్‌లో ఈ ప్రశ్నలే వస్తాయి’ అని సదరు విద్యార్థి తన తండ్రికి మెసేజీ చేశాడు. దీంతో ఆ పేపర్‌ను వాట్సాప్‌లో హాస్టల్లోని గర్ల్స్ అందరికీ సదరు ఆపరేటర్ పంపించాడు.
మే 3న ఎగ్జామ్ పూర్తయ్యాక.. ఎన్ని ప్రశ్నలు పరీక్షలో వచ్చాయో తెలుసుకొందామని ఆపరేటర్ కోచింగ్ సెంటర్లోని ఓ టీచర్‌కు ఈ గెస్ పేపర్‌ను చూయించాడు. బయాలజీ, కెమిస్ట్రీలో అడిగిన దాదాపు అన్ని ప్రశ్నలు ఈ గెస్ పేపర్లో ఉన్నట్టు ఆ టీచర్ చెప్పారు. దీంతో ఈ వివాదంలో తామెక్కడ ఇరుక్కొంటామేమోనని భయపడిపోయిన హాస్టల్ ఆపరేటర్.. సికార్‌లోని పోలీసులకు చెప్పాడు. అయితే ఆపరేటర్ మాటలను పోలీసులు నమ్మలేదు. పుకార్లు పుట్టించవద్దని హెచ్చరించారు. దీంతో ఎన్టీఏ అధికారులను ఆపరేటర్ సంప్రదించాడు. ఆ గెస్ పేపర్‌ను ఇంటెలిజెన్స్ బ్యూ రో (ఐబీ)కి పంపించిన ఎన్టీఏ.. రాజస్థాన్ పోలీసులను కూడా అలర్ట్ చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. హాస్టల్ ఆపరేటర్ సహా మరో 15 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.