Sunita Williams | న్యూఢిల్లీ, ఆగస్టు 31: గతంలో ఏర్పడిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే నాసా వ్యోమగాములైన ఇండో అమెరికన్ సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్లను ఎనిమిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉంచాల్సి వస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
2003లో భారత అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా, మరో ఆరుగురు స్పేస్‌షిప్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. 1986లో కూడా స్పేస్ షటిల్ ఛాలెంజర్ పేలిపోవడంతో 14 మంది వ్యోమగాములు మరణించారు. ఈ రెండు ఘటనలు పునరావృతం కాకూడదనే ఆలస్యమైనప్పటికీ విలియమ్స్, మరొకరిని సురక్షితంగా వెనక్కి రప్పించాలని అంతరిక్ష కేంద్రంలోనే ఉంచేశారు.
‘ఈ రెండు ప్రమాదాలు మాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అందుకే ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా వారిద్దరినీ తీసుకురావడమే మా ప్రాధాన్యం’ అని నాసా చీఫ్ బిల్ నెల్సన్ తెలిపారు. ఈ మిషన్‌కు సంబంధించి నాసా కొన్ని తప్పులు చేసిందని అంగీకరించిన ఆయన, వైఫల్యాలపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.