న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్భాటంగా ప్రారంభించిన మరో పథకం లక్ష్యం చేరకుండానే నీరుగారిపోయింది. కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్‌లో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌ని ఆర్భాటంగా ప్రకటించింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా దేశంలోనే బ్యాటరీ తయారీ వ్యవస్థను నిర్మించాలనేది ఈ పథకం లక్ష్యం. ఉద్యోగాల సృష్టి, పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యాలుగా దీన్ని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేండ్ల తర్వాత దీన్ని పరిశీలించినపుడు, ఏసీసీ పీఎల్ఐ ద్వారా 10.3 లక్షల ఉద్యోగాలను సృష్టించవలసి ఉండగా, కేవలం 1,118 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. రూ.11,250 కోట్ల మేరకు పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం రూ.2,870 కోట్లు మాత్రమే వచ్చాయి. జేఎంకే రిసెర్చ్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్ (ఐఈఈఎఫ్ఏ) నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ప్రోత్సాహకాలకు అర్హత నిబంధనలు కఠినం
2025 అక్టోబర్ నాటికి ఈ పథకం కింద ప్రోత్సాహకాల పంపిణీ జరగలేదు. ఇప్పటికీ మన దేశం నూటికి నూరు శాతం దిగుమతి చేసుకున్న బ్యాటరీలపైనే ఆధారపడుతున్నది. దీనికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం కోసం ఉద్దేశించిన ఈ పథకం అసలు లక్ష్యాన్ని సాధించడంలో తీవ్రంగా విఫలమైంది. విధానపరమైన, అమలుకు సంబంధించిన ఆటంకాల వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. ప్రోత్సాహకాలను పొందడానికి అవసరమైన అర్హత నిబంధనలు కఠినంగా ఉండటం, ఇన్స్టలేషన్ గడువును రెండేండ్లుగా నిర్ణయించడం, చైనీస్ టెక్నికల్ నిపుణులకు వీసాల ఆమోదంలో జాప్యాలు వంటి కారణాల వల్ల ఈ వైఫల్యం ఎదురైంది. స్పెషలైజ్డ్ బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ను ఇన్స్టాల్ చేసి, ప్రారంభించాలంటే చైనీస్ నిపుణులు అవసరం.