PM Modi : ప్రసిద్ధ సోమ్‌నాథ్ ఆలయ (Somnath Temple) చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. గత పాలకులు బానిస మనస్తత్వంతో సోమ్‌నాథ్ ఆలయ ప్రాముఖ్యతను విస్మరించారని కాంగ్రెస్ పాలకులను ఉద్దేశించి విమర్శలు చేశారు. స్వాతంత్య్రానంతరం సర్దార్ పటేల్ (Sardar Patel) చేసిన ఆలయ పునర్నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆరోపించారు.
భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంటే నాటి పాలకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ప్రధాని ధ్వజమెత్తారు. మూడు రోజుల గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సోమనాథ్పై విదేశీ దురాక్రమణదారులు అనేక దండయాత్రలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సోమ్‌నాథ్ ఆలయం.. ధైర్యం, త్యాగాలు, దృఢసంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు.
గజనీ మహ్మద్ సైన్యం సోమ్నాథ్పై దాడిచేసి విధ్వంసం సృష్టించి వెయ్యేళ్లు పూర్తయినా కూడా ఆ ఆలయంపై జెండా ఎగురుతూనే ఉందని, అది భారతదేశ స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ భారతదేశ విశ్వాసానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ఇవాళ తాను స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొనడం ఒక గొప్ప జ్ఞాపకమని చెప్పారు. ఈ జ్ఞాపకాన్ని తాను ఈ జీవితంలో మరిచిపోలేనని అన్నారు.
కాగా సోమ్‌నాథ్ ఆలయంపై దాడికి వెయ్యేళ్లయిన సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల ప్రత్యేక వ్యాసం రాశారు. పుణ్యక్షేత్రంపై గజనీ మహమ్మద్ క్రూర, హింసాత్మక దండయాత్ర చేసింది 1026 జనవరిలోనేనని, ఆలయ పునరుద్ధరణ తర్వాత 1951 మే 11న ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కృషితో ఆలయంలో భక్తులకు మళ్లీ దర్శనభాగ్యం కలిగిందని తన వ్యాసంలో పేర్కొన్నారు. దాడి ప్రయత్నం జరిగిన ప్రతిసారీ ఆలయాన్ని కాపాడుకునేందుకు ప్రజలు అడ్డుపడ్డారని, కొందరు ప్రాణత్యాగం కూడా చేశారని ఆయన గుర్తుచేశారు.