న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం హుందాతనాన్ని ప్రధాని మోదీ అగౌరవపరిచినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) అన్నారు. ఒక వర్గాన్ని లేదా విపక్షాన్ని టార్గెట్ చేసేందుకు.. ప్రధాని మోదీ ద్వేషపూరిత, అప్రజాస్వామిక ప్రసంగాలు చేసినట్లు మన్మోహన్ ఆరోపించారు. పంజాబ్ ప్రజలకు రాసిన లేఖలో మన్మోహన్ సింగ్ ఈ ఆరోపణలు చేశారు. జనాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో చాలా విషపూరితమైన విద్వేష ప్రసంగాలను ప్రధాని మోదీ చేసినట్లు మన్మోహన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ.. రాజస్థాన్లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి దేశ సంపదను దోచిపెడుతారని ఆరోపించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ ప్రామిస్ చేశారని, కానీ గడిచిన పదేళ్లలో రైతులు ఆదాయం తగ్గిపోయిందని మన్మోహన్ ఆరోపించారు. రైతుల రోజువారి సగటు ఆదాయం రూ.27 అని, కానీ సగటున రైతుల అప్పు 27 వేల ఉంటోందని, ఇంధనం-ఫర్టిలైజర్ల ధరలు పెరుగుతున్నాయని, దీనికి తోడు జీఎస్టీ జత కలుస్తోందని, ఫలితంగా రైతుల ఇండ్లల్లో డబ్బు ఆదా తగ్గిపోయినట్లు మన్మోహన్ తెలిపారు.
గడిచిన పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ లోపాలు, కోవిడ్లో మిస్ మేనేజ్మెంట్ వల్ల జీడీపీ వృద్ధిపై ప్రభావం పడినట్లు ఆయన అన్నారు. 2020-21లో జరిగిన రైతుల నిరసన ప్రదర్శన పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును మన్మోహన్ ఖండించారు. ఢిల్లీ సరిహద్దులో నిరీక్షిస్తూ 750 మంది పంజాబీ రైతులు ప్రాణాలు కోల్పోయారని, లాఠీలు, బుల్లెట్ల దెబ్బలకు రైతులు బలి అవుతుంటే, ఆందోళన చేస్తున్న ఆ రైతులను ఆందోళనజీవులు, పరాన్నజీవులంటూ మోదీ హేళన చేసినట్లు మన్మోహన్ తెలిపారు.
మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని మాత్రమే పంజాబీ రైతులు డిమాండ్ చేశారని, కానీ బీజేపీ సర్కారు పంజాబీలను పట్టించుకోలేదని మన్మోహన్ అన్నారు.