చెన్నై, డిసెంబర్ 25: తమిళనాడులో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్ అనంతరం ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో అవకతవకలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 97.37 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తూ ఈసీ ఈ నెల 19న ముసాయిదా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేయగా, పలువురు ఓటర్లు బతికున్నా తమ పేర్లను మరణించిన వారి జాబితాలో చేర్చారంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
‘సారూ.. నేను చావలేదు.. ఇంకా బతికే ఉన్నా.. అలాంటప్పుడు మరణించిన వారి జాబితాలో నా పేరు ఎందుకు చేర్చారు?’ అంటూ మాధవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అలమతి గ్రామ వాసి కే రఘు అధికారులను నిలదీశాడు. నేను బతికుండగానే చనిపోయానంటూ ఓటు తొలగించి ఓటు హక్కు తొలగించే అధికారం మీకెక్కడిదని ప్రశ్నించాడు. ఒక్క రఘుయే కాదు వేలాది మంది ఓటరు లిస్టుల నుంచి తమ పేర్లు తొలగించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చెన్నై నగరంలోనే 14.25 లక్షల మంది (గత లిస్టులో ఉన్న వారిలో 35 శాతం మంది)ని ఈసీ తొలగించింది. కాగా, నాలుగేండ్ల క్రితం మరణించిన ప్రముఖ గీత రచయిత పులమేపితన్ పేరు ఓటరు లిస్టులో ఉండటాన్ని డీఎంకే ఐటీ వింగ్ ప్రస్తావిస్తూ ‘వారు మరణించిన వారిని బతికిస్తారు.. బతికున్న వారిని చంపేస్తారు.. ఇదే ఈసీ సర్ మాయ’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.