Nambala Keshava Rao | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. నక్సల్ ఉద్యమంలో సాధారణ కార్యకర్తగా చేరిన నంబాల మావోయిస్టు పార్టీలో అత్యున్నతమైన ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టే స్థాయికి ఎదిగారు. ఆర్ఎస్యూలో క్రియాశీలకార్యకర్తగా వ్యవహరించిన నంబాల 1984లో పీపుల్స్‌వార్‌లో చేరారు. ఆయన 2018 నుంచి మావోయిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి మృతిచెందడం ఇదే ప్రథమం. శ్రీకాకుళం జయ్యన్నపేటలో మొదలైన నంబాల జీవితం ఛత్తీస్‌గడ్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో పరిసమాప్తమైంది. జయ్యన్నపేట నుంచి వరంగల్ ఆర్ఈసీ మీదుగా అజ్ఞాతంలోకి వెళ్లిన నంబాల ప్రస్థానం ఇది.
శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేటలో 1955లో జన్మించిన నంబాల కేశవరావు వరంగల్ ఆర్ఈసీ (నిట్)లో ఎంటెక్ (కెమికల్ ఇంజినీరింగ్) చదువుతున్నప్పుడే ఆర్ఎస్యూ (రాడికల్ స్టూడెంట్ యూనియన్)లో చురుకైన పాత్ర పోషించారు. కాలేజీలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ మధ్య సైద్ధాంతిక విభేదాలు, ఘర్షణలు, దాడులు, ప్రతిదాడులు కొనసాగేవి. అలా ఒకసారి ఏబీవీపీ విద్యార్థులపై జరిగిన దాడిలో నంబాలపై కేసు నమోదైంది. పోలీసుల వేధింపులు, నిత్యఘర్షణలు ఎక్కువ కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే, వరంగల్‌లో ఆర్ఈసీ విద్యార్థిగా ఉన్నప్పుడు హమాలీల కష్టాలు తెలుసుకునేందుకు ఆయన రాత్రిపూట హమాలీగా పనిచేశారు.
తల్లిదండ్రులు పెట్టిన పేరు కన్నా ప్రజలు ఇష్టంగా పిలుచుకునే పేరుతోనే ఉద్యమకారులు ప్రాచుర్యం అవుతారు. అలా సుదీర్ఘ ఉద్యమ జీవితంలో నంబాలకు ఎన్నిపేర్లు ఉన్నాయో లెక్కలేదంటారు. పోలీసు రికార్డుల ప్రకారం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చిరపరిచితమైంది. ఇంకా గగన్న, గంగన్న, ప్రకాశ్, కృష్ణ, విజయ్, ఉమేశ్, రాజు, కామ్లూ ఇలా అనేక పేర్లతో ఆయనను పిలిచేవారని అధికారవర్గాలు తెలిపాయి.
కొండపల్లి సీతారామయ్య (కేఎస్) నాయకత్వంలో పురుడుపోసుకున్న పీపుల్స్‌వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ) తొలితరం నాయకుల్లో నంబాల ఒకరు. గణపతి, కిషన్‌జీ, మల్లా రాజిరెడ్డి మొదలైనవాళ్లు మొదటి బ్యాచ్ అయితే, నంబాల సెకండ్ బ్యాచ్‌కు చెందినవారు. నంబాల ఈస్ట్ డివిజన్ (తూర్పుగోదావరి నుంచి విశాఖపట్నం మీదుగా ఒడిశా దాకా) నుంచి అజ్ఞాతజీవితం మొదలైంది. ఈస్ట్ డివిజన్ మొదటి దళం సభ్యుడిగా, దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడి (డీసీఎస్)గా, జిల్లా కార్యదర్శి (డీసీ)గా, స్టేట్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అక్కడి నుంచి డీకే (దండకారణ్య కమిటీ) కార్యదర్శిగా వ్యవహరించారు. 1991లో పీపుల్స్‌వార్ నుంచి కొండపల్లి సీతారామయ్య నిష్క్రమణ తరువాత నంబాల కేశవరావు 1992లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ (సీసీ) సభ్యుడయ్యారు. సీసీ మెంబర్‌గా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ మావోయిస్టు దళపతి ముప్పాళ లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి తరువాత నెంబర్ 2 స్థానానికి ఎదిగారు. మావోయిస్టు పార్టీలో అత్యున్నతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) చీఫ్‌గా వ్యవహరించారు. 25 ఏండ్లపాటు ఇటు పీపుల్స్‌వార్‌కు, అటు మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించిన గణపతి అనారోగ్య కారణాల రీత్యా మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. దీంతో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ నంబాల కేశవరావును 2018లో ఆ స్థానానికి ఎన్నుకున్నది.
ఈస్ట్ డివిజన్లో నంబాల పనిచేస్తున్న కాలంలో ఆ ప్రాంతంలోని జంగ్లాత్వాళ్ల (అటవీ అధికారుల) దౌర్జన్యాలు, పెత్తందారులు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా కోంద్, కొండరెడ్ల (ఆదివాసీ తెగలు) పోరాటం సాగింది. ఈ పోరాటానికి నంబాల నాయకత్వం వహించి మన్నెంవీరుడిగా గుర్తింపు పొందారు. ఆ సమయంలోనే కోంద్, కొండరెడ్డి తెగలకు చెందిన యువతను విప్లవోద్యమంవైపు నడిపించారు. అలా రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్‌గా నంబాలకు మావోయిస్టు పార్టీలో పేరొచ్చింది.
ఒడిశా రాష్ట్రంలోని కోరాపూట్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్‌పై మావోయిస్టులు మెరుపుదాడి చేసి ఆయుధాలను కొల్లగొట్టారు. కొల్లగొట్టిన ఆయుధాలను లారీలో తరలించారని, ఆ దాడికి నాయకత్వం వహించింది నంబాల కేశవరావేనని పోలీసు రికార్డులు చెప్తున్నాయి.
అజ్ఞాత జీవితంలోకి వెళ్లకముందు నంబాల వాలీబాల్ ప్లేయర్‌గా రాణించారు. ఉమ్మడి రాష్ట్ర వాలీబాల్ జట్టు నుంచి నేషనల్స్ కూడా ఆడారు. అంతకుముందు ఆయన కాకతీయ యూనివర్సిటీ కబడ్డీ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలలో ఆయన కేయూకు ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీ.టెక్ చదివిన నంబాల వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ)లో కెమికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చేశారు.
నంబాల కేశవరావును మెరుపుదాడుల వ్యూహకర్తగానే కాకుండా సృష్టికర్తగా కూడా పిలుస్తారు. పీపుల్స్‌వార్ పార్టీ ఎమర్జెన్సీ (1975-77), ఎమర్జెన్సీ అనంతర కాలంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్నది. ‘అన్న’లపై ఆశలు సన్నగిల్లుతున్న కాలంలో, ఉద్యమం వెనకపట్టు పడుతున్నదనుకున్న సమయంలో దేశ విప్లవోద్యమ చరిత్రనే మలుపు తిప్పిన అంబుష్ (మెరుపుదాడులు) ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ఆదిలాబాద్ జిల్లా ఆలంపల్లి ఒకటైతే, ఈస్ట్ డివిజన్లో దారగడ్డ (దారకొండ) అంబుష్ రెండోది. ఒకదానికి సాగర్ నాయకత్వం వహిస్తే, రెండోదానికి నంబాల నాయకత్వం వహించారు. ఈ రెండు వరుస ఘటనలు మావోయిస్టు ఉద్యమం (పీపుల్స్‌వార్) పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని, పార్టీ క్యాడర్లో నైతిక ైస్థెర్యాన్ని నింపాయని చెప్తారు. మెరుపు వ్యూహకర్తగా పేరున్న నంబాల అదే మెరుపు వ్యూహంతో 1986లో తప్పించుకున్నారు. ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎస్టీఎఫ్ పోలీసులు ఆయనను గాయపరచి అరెస్టు చేసి వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న తరుణంలో వారి దగ్గరి నుంచి ఆయుధం గుంజుకొని ఫైర్చేస్తూ తప్పించుకున్నారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి నంబాల మూలస్తంభం.