అహ్మదాబాద్, జనవరి 7: గుజరాత్లో అమలవుతున్న ‘నల్లా నీరు’ పథకం విజయవంతమైందని అధికార బీజేపీ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్నా.. జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 57 శాతం గృహాలకు నల్లాల ద్వారా మంచినీటిని అందించే సదుపాయం లేదని తెలిపింది. గృహ నల్లా కనెక్షన్ల కార్యాచరణ అంచనా (ఎఫ్‌హెచ్‌టీసీ) ప్రకారం 47 శాతం గృహాలకు మాత్రమే నల్లా నీటి సరఫరా అందుబాటులో ఉంది. అలాగే ఈ నివేదిక ప్రకారం ఇప్పటికీ పలు జిల్లాలకు నల్లా ద్వారా నీటి సరఫరా పూర్తిగా లేదా చాలావరకు అందుబాటులో లేదు.
బనస్కాంత, దాహుద్ లాంటి జిల్లాల్లో అయితే నల్లా ద్వారా నీటి సరఫరా సున్నా శాతం ఉండగా, చాలా జిల్లాలో జాతీయ సగటు శాతం కన్నా దిగువనే ఉంది. నీటి నాణ్యత సూచికలో దేశంలో గుజరాత్‌కు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 30వ ర్యాంక్‌ను ఇచ్చింది. రాజధాని గాంధీనగర్‌లో కాలుష్య జలాల కారణంగా పలువురు టైఫాయిడ్ బారిన పడ్డారు. నల్లా ద్వారా నీటిని అందించే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘నల్ సే జల్’ పథకం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంత ప్రజలు మంచినీటికి బదులు కలుషిత జలాలే సేవిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు అసురక్షితమైన మంచినీటిని తాగుతున్నారని ఈ సర్వే ద్వారా తెలిసింది. రాష్ట్రంలోని మూడో వంతు గ్రామీణ ప్రాంత తాగునీరు.. పౌరుల వినియోగానికి ఎంతమాత్రం యోగ్యం కాదని ఈ నివేదిక వెల్లడించింది.
ఈ ఏడాది జనవరి 4న ప్రచురితమైన కార్యాచరణ అంచనా నివేదిక ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో నీటి నాణ్యత పరిశీలనకు నిర్వహించిన శాంపిల్స్‌లో 63.3 శాతం మాత్రమే నాణ్యతా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయి. అంటే ఎంపీలోని గ్రామీణ ప్రాంతంలో 36.7 శాతం నీటి శాంపిల్స్ కలుషిత జలాలుగా తేలాయి.