న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశీయంగా అభివృద్ధి చేయనున్న అత్యాధునిక ‘కామికేజ్’ డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) ఆవిష్కరించింది. ‘డూ అండ్ డై’ అనే పద్ధతిలో అప్పగించిన పనిని ఈ డ్రోన్ సమర్థంగా పూర్తి చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ స్వదేశీ మానవ రహిత వాయు వాహనంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజిన్లను వినియోగిస్తున్నట్టు తెలిపింది. కామికేజ్ డ్రోన్లకు ఏకంగా 1,000 దూరం వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని వెల్లడించింది.
కామికేజ్ డ్రోన్లు 21వ శతాబ్దంలో యుద్ధ రంగంలో గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని ఎన్ఏఎల్ డైరెక్టర్ డాక్టర్ అభయన్ పషిల్కర్ పేర్కొన్నారు. కామికేజ్ డ్రోన్ల ప్రాజెక్టు ప్రారంభానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్) ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఇలాంటి ఆయుధాలను ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. రష్యా దళాలను, సాయుధ వాహనాలను లక్ష్యంగా చేసుకొనేందుకు ఉక్రెయిన్ సైన్యం ఈ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నది.
కామికేజ్ అనేది ఒక జపనీస్ పదం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక ప్రత్కేక అటాకింగ్ యూనిట్‌కు ఈ పేరు పెట్టారు. ఇందులోని మిలటరీ పైలట్లు తమ యుద్ధ విమానాలను శత్రు లక్ష్యాలపై కూల్చడం ద్వారా ఆత్మాహుతి మిషన్లు నిర్వహించేవారు.
2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు
120 కేజీల బరువు, గంటకు 180 కి.మీ గరిష్ఠ వేగం
1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం
25 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు
ఆత్మాహుతితో ఎంచుకొన్న లక్ష్యాలను నాశనం చేస్తాయి
దూరంగా ఉండి కూడా మానవ కమాండ్లు ఇవ్వొచ్చు
ఈ డ్రోన్లను గుంపుగా శత్రు లక్ష్యాలపైకి పంపొచ్చు
రాడార్లు, శత్రు రక్షణ వ్యవస్థను అధిగమించే సామర్థ్యం
న్యూఢిల్లీ, ఆగస్టు 13: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ‘పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్’ క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ వర్గాలు మంగళవారం ప్రకటించాయి.
రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో డీఆర్డీవో చేపట్టిన క్షిపణి ట్రయల్స్ విజయవంతమయ్యాయి. క్షిపణి పనితీరు, వార్‌హెడ్ పనితీరు అద్భుతంగా ఉందని అధికారులు తెలిపారు.